తెలంగాణ సీఎం పదవే కవిత టార్గెట్టా

Update: 2015-10-18 04:44 GMT
నిజామాబాద్ ఎంపీ - కేసీఆర్ కుమార్తె కవిత ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను నిర్వహించడంలో ప్రస్తుతం తలమునకలై ఉన్నారు. ఆమె భవిష్యత్తులో భారీ ప్రయోజనాన్ని ఆశించే ఈ కార్యక్రమాన్ని ఇంత హైలెైట్ చేస్తున్నారని వినికిడి. గతంలో తెలంగాణ రాష్ట్రంకోసం ఆందోళనలు జరుగుతున్న కాలంలో బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ వాసులను ఐక్యపరిచాయి. ఇప్పుడు కవిత ఇతర దేశాల్లో కూడా భారీ ఎత్తున ఈ బతుకమ్మల జాతరను నిర్వహించడంలో తీరిక లేకుండా ఉన్నారు.

పైగా గతంలో ఎన్నడూ లేనంత భారీగా డబ్బు ఖర్చుపెడుతూ బతుకమ్మ పండుగను విజయవంతం చేయడానికి కవిత ప్రయాస పడుతున్నారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో రెగ్యులర్‌ గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ కార్యక్రమాల గురించి మీడియాకు ప్రత్యేకంగా సమాచారమిస్తున్నారు.

ఇదంతా చూసి ఒక మీడియా మిత్రుడికి కాస్త సందేహం పుట్టుకొచ్చింది. ఇక దాచుకోలేక కేసీఆర్ తర్వాత తదుపరి సీఎం పోస్టును ఆకాంక్షిస్తున్నారా అని ఎదురుగానే అడిగేశాడతను. దానికి కవిత సున్నితంగానే తిరస్కరించారనుకోండి.

కొద్దికాలంగా మాత్రమే రాజకీయాల్లో ఉంటున్న కవిత తన మనసులో భావాన్ని అంత సులభంగా బయటపెట్టలేకపోవచ్చు కానీ భవిష్యత్తులో సరైన సమయంలో తన ప్రణాళికలను ఆమె స్వయంగా బయటపెట్టవచ్చు. కాని తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కవిత అర్హతలు ఏం తక్కువని వాదించే వారు కొందరున్నారు.

మామూలుగా అయితే కేసీఆర్ వారసత్వం నాదంటే నాదని పుణికి పుచ్చుకోవడానికి ఒకవైపు అన్ని అర్హతలు నాకే ఉన్నాయని అనుకునే సీనియర్ మంత్రి హరీష్ రావు, స్వయంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఇద్దరూ పోటీ పడుతున్న వాతావరణం ఉంది. ఎవరికి వారు మొత్తం తెలంగాణ మీద తమతమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి తపన పడుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన వారసత్వం ఎవరికనే ఎంపిక చేయాల్సి వస్తే.. నిత్యం పోటీ పడుతున్న వీరిద్దరినీ పక్కన పెట్టి.. అసలు వివాదం లేకుండా.. కవితను తెరమీదికి తెస్తారనే వాదన ఒకటి బాగా వినిపిస్తోంది.
Tags:    

Similar News