ఢీల్లీ కేంద్రంగా కేసీయార్ 10 రోజుల టూర్ ?

Update: 2022-04-16 06:29 GMT
తొందరలోనే కేసీయార్ ఢిల్లీలో పదిరోజులు మకాం వేయనున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఉత్తరాధిలో పదిరోజుల పాటు పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. తన పదిరోజుల పర్యటనలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో కూడా పర్యటించబోతున్నట్లు  సమాచారం. యూపీ, మహారాష్ట్ర పర్యటనలో సీనియర్ రాజకీయ నేతలతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులను కూడా కలిసేట్లుగా ప్లాన్ చేస్తున్నారట.

కొంతకాలంగా నరేంద్రమోడి సర్కార్ పై విరుచుకుపడుతున్న కేసీయార పూర్తిగా బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే మూడుసార్లు ఢిల్లీలో పర్యటించారు.

తన పర్యటనల్లో భాగంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, శరద్ పవార్, రైతునేత రాకేష్ తికాయత్ తో పాటు చాలామందిని కలిశారు. మొన్నటి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో యూపీలో ప్రచారం చేస్తారని అనుకున్నా ఎందుకనో కార్యరూపం దాల్చలేదు.

అయితే తొందరలో జరగబోయే పర్యటనలో ఢిల్లీ నుండి ముందు యూపీకే వెళతారట. యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతులపైకి కేంద్రమంత్రి వాహనం నడిపిన ప్రాంతాన్ని కూడా చూస్తారట. ఢిల్లీలోని ఆర్ధికవేత్తలు, సామాజికవేత్తలతో పాటు రైతుసంఘాల నేతలతో కూడా భేటీ అవుతారు.

మధ్యలో మహారాష్ట్రకు వెళ్ళి ఎన్సీపీ నేత శరద్ పవార్ తో కూడా సమావేశమవుతారు. ఈమధ్యనే ఢిల్లీకి వెళ్ళిన కేసీయార్ వారంపాటు మకాం వేసిన విషయం తెలిసిందే. అయితే వారంపాటు ఢిల్లీలో ఏమి చేశారనే ప్రశ్నకు సమాధానం లేదు.

మరి తొందరలోనే ఢిల్లీ వెళ్ళబోతున్న కేసీయార్ 10 రోజులు ఏమి చేస్తారో తెలీదు. ఇప్పటికే బీజేపీ వ్యతిరేకుల్లో చాలామందితో భేటీ అయ్యారు. కేంద్రంపై యుద్ధం ప్రకటించిన కేసీయార్ ఏమి సాధించారో తెలీటంలేదు. ఇప్పటికప్పుడు తనతో కలిసొచ్చే పార్టీల అధినేతలు కూడా లేరు.

యూపీఏ కూటమితో కేసీయార్ కలవలేరు. అలాంటపుడు ఎన్డీయే వ్యతిరేకత వైఖరి వల్ల కేసీయార్ కు వచ్చే లాభం ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. కేసీయార్ కున్న ట్రాక్ రికార్డు చూసిన తర్వాతే చేతులు కలపటానికి ఎవరు ముందుకు రావటంలేదు. మరి చివరకు కేసీయార్ రాజకీయ వ్యూహాలు ఏమవుతాయో చూడాల్సిందే.
Tags:    

Similar News