చేతులెత్తి దండం పెడుతున్నా అని సారు మాటను తేలిగ్గా తీసుకోవద్దు

Update: 2020-03-22 04:53 GMT
చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సిన రీతిలో.. ప్రజలకు అర్థమయ్యేలా.. వారి మనసుల్లో రిజిస్టర్ అయ్యేలా చేసే నేర్పు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో కాస్త ఎక్కువే. ఎప్పుడు ఎక్కాలో కాదు.. ఎప్పుడు తగ్గాలో కూడా సారుకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. అప్పుడప్పుడు మాత్రమే మీడియా భేటీలు ఏర్పాటు చేసే కేసీఆర్.. కరోనా పుణ్యమా అని వారం.. పది రోజుల వ్యవధిలోనే మూడుసార్లు ప్రెస్ మీట్ పెట్టారని చెప్పాలి.

మొదటి రెండు సార్లతో పోలిస్తే.. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగటానికి కారణం.. స్థానిక ప్రజల కన్నా.. విదేశాల నుంచి వచ్చే వారే అన్న విషయం తెలిసిందే. దీంతో.. వారికి మరింత అవగాహన పెరిగేలా చేయటంతో పాటు.. స్థానికులకు మరింత బాగా అర్థమయ్యేలా చేయటం కోసం.. ఎప్పుడు లేని రీతిలో సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాట ఆసక్తికరంగా మారింది.

చేతులెత్తి దండం పెడుతున్నా. మిమ్మల్ని వేడుకుంటున్నా. విదేశాల నుంచి వచ్చిన వారు మా బిడ్డలే. మా వోళ్లే. మీరు అత్యుత్సాహంతో బయటకు పోయి.. కుటుంబాన్ని.. సమాజాన్ని చెడగొడతారు. దయచేసి మీరు కొంచెం ప్రభుత్వం చెప్పినట్లు వినాలె.. అంటూ ఎందుకు వేడుకుంటున్నారంటే? ప్రజలకు అర్థమయ్యేలా చేయటం.. కరోనా వైరస్ తీవ్రత ఎంతన్నది తెలియజేయటమే లక్ష్యమని చెప్పాలి. కేసీఆర్ లాంటి పెద్ద మనిషి నోట ఇంత మాట వచ్చిందంటే మాటలా? పరిస్థితి ఎంత ఖరాబుగా ఉందన్న మెసేజ్ ప్రజల్లోకి పోవటం కోసమే.. ఆయన అలా మాట్లాడారని చెప్పక తప్పదు.

అనవసరమైన సమయాల్లో స్థాయి చూపించుకోవాలన్న తపన కేసీఆర్ లో అస్సలు కనిపించదు సరికదా.. ఇష్యూను డీల్ చేయటానికి.. కరోనా లాంటి కొరివిదెయ్యం సంగతి పట్టటానికి తానెంతకైనా సిద్ధమన్న విషయాన్ని తాజా మాటతో చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News