రేవంత్ ఓట‌మికి..కేసీఆర్ ప్లానేంటో తెలుసా?

Update: 2018-07-02 11:09 GMT
రేవంత్ రెడ్డి... తెలంగాణ రాజ‌కీయాల్లోనే కాకుండా ఏపీ రాజ‌కీయాల్లోనూ  ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరే. తెలంగాణలోని పాత జిల్లా అయిన మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా వాసిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రేవంత్ రెడ్డి... వ‌చ్చీ రాగానే త‌న‌దైన శైలి స‌త్తా చాటారు. టీడీపీ నేత‌గా రాజ‌కీయ  జీవితం ప్రారంభించిన రేవంత్‌... తెలంగాణ‌లో  పార్టీకి పెద్ద దిక్కే అయ్యారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి... ఓటుకు నోటు కేసు దెబ్బ‌కు పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు అప్ప‌టిక‌ప్పుడు ఉన్న‌ప‌ళంగా మూటా ముల్లె స‌ర్దుకుని  విజ‌య‌వాడ‌కు పారిపోగా... అదే కేసులో జైలు జీవితం కూడా గ‌డిపి వ‌చ్చిన రేవంత్ మాత్రం... కేసీఆర్ స‌ర్కారు బెదిరింపుల‌కు - అదిరింపుల‌కు ఏమాత్రం బెద‌ర‌లేద‌నే చెప్పాలి. అంతేకాకుండా... జైలుకెళ్లివ‌చ్చిన త‌ర్వాత టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుపై ప్ర‌త్య‌క్ష పోరాటమే మొద‌లెట్టిన రేవంత్‌... టీడీపీలో ఉండి ఆ పోరాటానికి న్యాయం చేయ‌లేన‌ని భావించి... ఏకంగా త‌న‌కు రాజ‌కీయంగా జ‌న్మ‌నిచ్చిన పార్టీని వ‌దిలేసి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ లో చేరిపోయారు.

ఏ పార్టీలో ఉన్నా... ఏ స్థానంలో ఉన్నా కూడా రేవంత్ రెడ్ది న‌డిపే వ్య‌వ‌హారం చాలా వెరైటీగానే కాకుండా సూటిగా సుత్తి లేకుండానే ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తెలంగాణ‌లో కేసీఆర్ పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మంటూ ప్ర‌క‌టించిన రేవంత్‌... దాని కోస‌మే కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ట్టుగానే చెప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ లో ఆయ‌న‌కు ఇప్పుడు పెద్ద‌గా ప్రాధాన్యం ల‌భించ‌కున్నా... ఏమాత్రం నిరాశ చెంద‌ని రేవంత్ త‌న‌దైన శైలి రాజ‌కీయం న‌డుపుతున్నారు. ఈ  క్ర‌మంలో  త్వ‌ర‌లోనే  సార్వ‌త్రిక ఎన్నిక‌లు రానున్నాయి. లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. బీజేపీ ముంద‌స్తుకు సై అంటే... ఏపీ మాట ఎలా ఉన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేసీఆర్ కూడా సిద్ధంగానే ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో నిర్దేశిత స‌మ‌యం కంటే ముందుగానే ఎన్నిక‌లు వ‌స్తే... ఎలాంటి వ్యూహాలు అవ‌లంబించాల‌న్న కోణంలో  ఇప్ప‌టికే కేసీఆర్ ఓ అంచ‌నాకు వ‌చ్చారు. ఈ అంచ‌నాల్లో అంద‌రికీ ఆశ్య‌ర్యం క‌లిగిస్తున్న ఓ అంశం ఇదేనంటూ ఇప్పుడు ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే... వాటిలో 118 ఒక వంతు అయితే... ఒక్క సీటు మాత్రం మ‌రో వంతు అన్న చందంగా కేసీఆర్ వ్యూహం ర‌చిస్తున్నార‌ట‌.

ఆ ఒక్క సీటు ఎవ‌రిద‌న్న విష‌యానికి వ‌స్తే... ఇంకెవ‌రిది... కేసీఆర్‌ను బ‌హిరంగంగానే నిల‌దీయ‌డంతో పాటు బ‌స్తీ మే స‌వాల్ అన్న రీతిలో స‌వాల్ విసిరిన రేవంత్ రెడ్డి. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కొడంగ‌ల్ నుంచి గ‌డ‌చిన ఎన్నికల్లో బ‌రిలోకి దిగిన  రేవంత్‌... టీడీపీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అయితే ఆ త‌ర్వాత పార్టీ మారిన సంద‌ర్భంగా టీడీపీ టికెట్ తో త‌న‌కు ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేసేశారు. అయితే ఆ  రాజీనామా ఇంకా ఆమోదం పొంద‌లేదు. సో... రేవంత్ రెడ్డి ఇంకా కొడంగ‌ల్ ఎమ్మెల్యేగా ఉన్న‌ట్లే. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని  నియోజ‌కవ‌ర్గాల‌పై  స‌ర్వే చేయించుకున్న విష‌యం తెలిసిందే. ఈ స‌ర్వేలో భాగంగా కొడంగ‌ల్ స‌ర్వేపై కేసీఆర్ ప్ర‌ధానంగా దృష్టి సారించార‌ట‌.  ఏం చేసైనా స‌రే... రేవంత్ ను ఓడించి తీరాల‌న్న క‌సితో అన్ని మార్గాల నుంచి స‌మాచారం తెప్పించుకున్న కేసీఆర్‌కు పిడుగులాంటి రిజ‌ల్ట్ వ‌చ్చిందట‌.

ఎన్ని చేసినా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని, ఆ విజ‌యం కూడా 15 నుంచి 20 వేల ఓట్ల మెజారిటీతోన‌ని తెలిసి కేసీఆర్ షాక్ తిన్నార‌ట‌. అయితే మెజారిటీని నామ‌మాత్రానికి ప‌రిమితం చేయ‌డం ఓ ఎత్తు అయితే... ఏం చేస్తే రేవంత్ విజ‌యాన్ని అడ్డుకోవ‌చ్చ‌న్న కోణంలో కేసీఆర్ అందుబాటులో ఉన్న అన్ని మార్గాల‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే కొడంగ‌ల్ టీఆర్ఎస్ క‌న్వీన‌ర్ గా ఉన్న గురునాథ‌రెడ్డిని బ‌రిలోకి దింప‌డ‌మా?  లేదంటే కొత్త నేత‌ను తీసుకువ‌చ్చి నిల‌ప‌డ‌మా? అన్న విష‌యంలో కేసీఆర్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నార‌ట‌. అంతేకాకుండా రేవంత్‌ను ఓడించే వ్యూహాన్ని ర‌చించాల‌ని - ఆ వ్యూహం ఫ‌ల‌ప్ర‌దం అయ్యేందుకు ఎంత ఖ‌ర్చు అవ‌స‌ర‌మైనా వెనకాడేది లేద‌ని, కేసీఆర్ త‌న స‌న్నిహితుల‌కు చెప్పార‌ట‌. మ‌రి ఈ ప్లాన్  ఏ మేర‌కు వ‌ర్క‌వుటవుతుందో చూడాలి.
Tags:    

Similar News