కొత్త దేవుడంటే.. అలానే ఉంటాది.. కేసీఆర్ ఇంత ఈజీగా కనిపించటమా?

Update: 2022-12-16 04:40 GMT
మార్కెటింగ్ లో రెండు వ్యూహాలు ఉంటాయి. ఒకటి అందరికి అందుబాటులో ఉండేలా ప్లాన్ చేయటం. మరొకటి విపరీతమైన హైప్ క్రియేట్ చేసి.. ఎవరికి దొరకని రీతిలో వ్యవహరిస్తూ.. దానికి డిమాండ్ ను క్రియేట్ చేయటం ద్వారా.. సదరు వస్తువు దొరికితే చాలురా భగవంతుడా? అనేలా చేయటం మరో వంతు. మార్కెటింగ్ లో రెండో దానితో పోలిస్తే మొదటి వ్యూహానికే అమితమైన ప్రాధాన్యతను ఇస్తుంటాయి కార్పొరేట్ కంపెనీలు. ఇక.. ప్రజాజీవితంలో ఇలాంటి వ్యూహాల్లో మొదటిది మాత్రమే వర్కువుట్ అవుతుందే తప్పించి రెండోది కాదు. ఒకవేళ రెండోదానికి ప్రయత్నించినా మొదటికే మోసం రావటం ఖాయం.

ఎక్కడి దాకానో ఎందుకు టీఆర్ఎస్ (అదేనండి బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ సంగతే చూడండి. ఆయన దర్శనం లభించటం చాలా క్లిష్టం. అలాంటి గులాబీ బాస్ ఇప్పుడు ఢిల్లీలో అందరికి అందుబాటులో ఉంటూ.. ఎవరు కలవాలనుకున్నా.. ఇట్టే కలిసిపోయే అవకాశాన్ని ఇస్తున్నారు. ప్రాంతీయ పార్టీని కాస్తా జాతీయ పార్టీగా మార్చేసిన వేళ.. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసిన సందర్భంలో.. తనను కలవటానికి వస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికి అందుబాటులో ఉంటున్న ఆయన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా గులాబీ బాస్ కేసీఆర్ దర్శనం అంటే మామూలు విషయం కాదు. కొమ్ములు తిరిగిన మంత్రులకు సైతం ఆయన ఎప్పుడు టైం ఇస్తారో.. మరెప్పుడు అందుబాటులో ఉంటారో ఒక పట్టాన అర్థం కాదు. అలాంటిది ఇప్పుడు ఆయన్ను ఇట్టే కలిసే అవకాశం రావటం అంటే మాటలు కాదు. ఇదంతా చూస్తున్నప్పుడు.. 'కొత్తా దేవుడండి.. సరికొత్తా దేవుడండి' అంటూ సాగే పాత పాట ఒక్కసారి గుర్తుకు రావటం ఖాయం.

ఢిల్లీలోని తుగ్లకో రోడ్డులోని తన అధికారిక నివాసంలో కేసీఆర్ ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంటూ.. ఎవరు ఎప్పుడు కలవాలన్నావారిని కలిసేందుకు వీలుగా సర్వదర్శనానికి తెర తీసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. గులాబీ బాస్ ను రీచ్ కావటం మామూలు విషయం కాదన్న మాటకు బదులుగా.. కేసీఆర్ సారును ఇట్టే కలిసేయొచ్చన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది.

ముఖ్యమంత్రిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వహించినప్పటికీ.. ప్రజల సమస్యల్ని వినేందుకు.. ఆయన్ను కలిసేందుకు చేసే ప్రయత్నాలు ఏమీ ఇప్పటివరకు జరగలేదు. ఉద్యమ నాయకుడు కాస్తా ముఖ్యమంత్రి అయిన వేళ.. సామాన్యులకు అందుబాటులో ఉంటూ.. నిత్యం తనను కలవాలనుకునే వారిని కలిసేందుకు అవకాశం ఉన్నా.. అదేమీ ఫాలో కానీ కేసీఆర్ తన జాతీయ పార్టీ ఏర్పాటులో భాగంగా పార్టీ ఆఫీసును ఓపెన్ చేయటం తెలిసిందే.

తాజాగా ఆయన మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అందరికి అందుబాటులో ఉంటున్నారు. ఇంత సమయం అందరికి అందుబాటులో ఉండటం కేసీఆర్ విషయంలో మామూలు కాదని గులాబీ నేతలు సంబరపడిపోతున్నారు. కొత్త పార్టీ అందునా దేశ మంతా తన ప్రభ పాకాలంటే.. ఇలాంటివి మరెన్ని చేయాల్సి ఉంటుందో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News