ఈసారి ఫాంహౌస్ లో ఆ పనిలో కేసీఆర్ బిజీబిజీ?

Update: 2016-06-08 04:23 GMT
తరచూ ఫాంహౌస్ వెళ్లటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మామూలే. అందరూ అనుకున్నట్లు అది తన ఫాంహౌస్ అనే కంటే.. తన ఇల్లుగా కేసీఆర్ ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో సమర్థించుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన నియోజకవర్గంలోనే తాను ఉన్నానని.. ఫాంహౌస్ లో ఉండి కూడా ప్రభుత్వ కార్యకలాపాల మీద దృష్టి పెడతానని ఆయన చెప్పుకొచ్చారు. గడిచిన మూడు రోజులుగా ఫాంహౌస్ లో ఉంటున్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? అన్నది ఒక ప్రశ్న.

దినపత్రికల్లో వస్తున్నట్లుగా ఆయన ఫాంహౌస్ లోని పంటల్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నట్లుగా భావిస్తే తప్పులో కాలేసినట్లే. నిజానికి అందరి ఊహాలకు భిన్నంగా వ్యవహరించటం కేసీఆర్ కు మామూలే. ఉద్యమ సమయంలో తన అవసరం లేదని భావిస్తే.. వారాల తరబడి ఆయన బయటకు వచ్చేవారు కాదు. చివరకు ఆయన మాట కోసం.. స్పందన కోసం అంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సి వచ్చేది. ఆయన ప్రత్యర్థులు పలువురు కేసీఆర్ తాగి పడిపోయేవారంటూ అవాకులు చవాకులు పేలేవారు. కానీ.. కేసీఆర్ మాత్రం వ్యూహాలతో.. తాను చేయాల్సిన పోరాటాలకు సంబంధించిన వ్యూహాలతో బిజీబిజీగా ఉండేవారు. తన మీద వచ్చే విమర్శల్ని ఆయన పెద్దగా పట్టించుకునేవారు.

ఉద్యమ నేతగా వ్యవహరించే రాజకీయ నేత క్రమం తప్పకుండా ప్రజల్లోనే ఉండాలని.. ఉద్యమ నేతలకు అందుబాటులో ఉంటూ.. ఉరకలెత్తించాలంటూ చెప్పే రెగ్యులర్ మాటలకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరించే వారు. తాజాగా ఫాంహౌస్ లో సేద తీరుతున్నట్లుగా వార్తలు వచ్చినప్పటికీ ఆయన ఫోకస్ మాత్రం భిన్నంగా ఉందని చెబుతున్నారు. మంగళవారం నాటి విషయాన్నే తీసుకుంటే.. హైదరాబాద్ లోని కలెక్టర్లు.. ప్రభుత్వ ముఖ్య అధికారులు కొత్త జిల్లాల మీద కిందామీదా పడి చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. మరి.. ఇదే సమయంలో ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ ఏం చేస్తున్నారన్న విషయం తెలుసుకుంటే కొద్దిపాటి విస్మయానికి గురి కావాల్సిందే.

ఎందుకంటే కలెక్టర్లు.. ముఖ్య అధికారులు ఏ విధంగా అయితే కొత్త జిల్లాల మీద ఫోకస్ పెట్టి కసరత్తు చేస్తున్నారో.. కేసీఆర్ సైతం తన ఫాంహౌస్ లో గూగుల్ మ్యాప్ లను ముందేసుకొని కొత్తజిల్లాల మీద తనకు తాను అధ్యయనం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కలెక్టర్లు.. ముఖ్య అధికారులు నివేదించనున్న కొత్త జిల్లాల అంశంపై తన వాదనను సిద్ధం చేసుకునేందుకు వీలుగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు చెప్పొచ్చు. ఈ రోజు (బుధవారం) కొత్త జిల్లాలపై కలెక్టర్ల ప్రతిపాదన తన దృష్టికి రానున్న నేపథ్యంలో.. కొత్త జిల్లాల స్వరూపం ఎలా ఉండాలన్న అంశంపై ఆయన పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నద్ధత కోసమే ఫాంహౌస్ ఈసారి అన్ని రోజులు కేసీఆర్ ఉన్నట్లుగా కీలక నేతలు పలువురు చెబుతున్నారు.
Tags:    

Similar News