సీఎం సిన్నప్పటి కతలు

Update: 2016-01-12 07:27 GMT
తాను సీఎంనన్న సంగతి మర్చిపోయారు.. తన బుర్రలోంచి పాలనా వ్యవహారాలు - రాజకీయాలు - ముందున్న ఎన్నికలు అన్నీ తీసేశారు.. చిన్ననాటి మిత్రులతో ముచ్చట్లు పెట్టారు. ఎలా చదువుకున్నామో, ఎలా సందడి చేశామో.. అన్నీ గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు.  తాను చదువుకున్న దుబ్బాక స్కూల్‌ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన చిననాటి ముచ్చట్లను నెమరు వేసుకున్నారు.

మామూలుగానే కేసీఆర్ మంచి మాటకారి... అలాంటి బాల్యం - స్నేహం - అందులోని ఆనందం - మాధుర్యం వంటి బరువైన అంశాలు ఆయన నోటి నుంచి వస్తే ఇంకెలా ఉంటుంది. భావోద్వేగాలు పలికించారు..  అప్పటి అనుభవాలు ఆయన ఒక్కటొక్కటిగా చెప్తుంటే అప్పటి ఆయన సహవాసులంతా వాటిని గుర్తు తెచ్చుకున్నారు.. నవ్వుకున్నారు, కన్నీళ్లు పెట్టుకున్నారు... ఒకటేమిటి అన్ని భావాలనూ కేసీఆర్ వారిలో కలిగించారు. ఒక్కొక్కరిని ఆయన పేరుపేరునా పిలుస్తుంటే ముఖ్యమంత్రయినా సరే మనోడు మారలేదురా... అదే అభిమానం, అదే ఆప్యాయత అనుకుంటూ సంబరపడిపోయారు.

దుబ్బాకలో తాను చేసినపనులన్నీ కేసీఆర్ గుర్తు తెచ్చుకున్నారు. దేవునిబావిలో తాను వందసార్లకు పైనే ఈత కొట్టానని.. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు రామసముద్రం చెరువు కట్టపై కూర్చొని ఉత్పలమాల.. చంపకమాల పద్యాలు రాసిన విషయాలతో పాటు.. తాను చేసిన పనులెన్నింటినో చెప్పుకొచ్చారు. గురువులు తమకు విద్యాబుద్ధులు ఎలా నేర్పారో చెబుతూ వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారాయన.  ప్రత్యేకంగా తనపై ఎంతో ప్రభావాన్ని చూపిన మృత్యుంజయశర్మ మాష్టారు గురించి పదే పదే చెప్పుకొచ్చారు. ఎలాంటి భాషా దోషాలు లేకుండా పద్యాలు అప్పచెబితే.. వందపేజీల పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చే వారని.. ఒకసారి ఉత్తర గోగ్రహణం అనే పద్యాన్ని క్లాసులో చెప్పి.. తప్పులు లేకుండా అప్పజెబితే 200 పేజీలో నోట్‌ బుక్‌ ఇస్తానని చెప్పారని.. తాను లేచి అయిదుసార్లు చదివి చెబుతానని చెప్పి.. తప్పుల్లేకుండా అప్పజెప్పానని గుర్తు చేసుకున్నారు. మాష్టారు తాను ఇచ్చిన మాటకు తగ్గట్లే 200పేజీల నోట్‌ బుక్‌ ఇచ్చినట్లు గుర్తు చేసుకొన్న కేసీఆర్‌.. ఇప్పుడు అనాటి అంకిత భావం ఉన్న ఉపాధ్యాయులు కనిపించటం లేదన్న ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం  చిన్నతనంలో తనకు పాఠాలు చెప్పిన గురువులకు సీఎం పాదాభివందనం చేశారు. పాఠశాల మిత్రులు, తన గురువులు.. ఇలా అందరినీ కలుసుకోవడం అపురూప ఘట్టమని సీఎం అన్నారు.

అంతేకాదు.... తన దోస్తులందరినీ ఫాం హౌస్ కు రమ్మని ఆయన ఆహ్వానించారు. బొమ్మెర వెంకటేశం అనే తన బాల్యమిత్రుడికి ఆ బాధ్యత అప్పగించారు.  బొమ్మెర వెంకటేశం కనపడగానే ఆప్యాయంగా పలకరించారు. ''బాగున్నావురా వెంకటేశ్...? పిల్లలేం చేస్తున్నరు? దోస్తులందరినీ నువ్వే ఫామ్‌హౌస్‌కు తీస్క రావాలె'' అని అనగానే వెంకటేశం ఉబ్బితబ్బిబ్బయ్యాడు.  చిన్ననాటి మిత్రులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను ఉన్నానన్న విషయాన్ని మరిచిపోవద్దంటూ భరోసా ఇచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే బాల్యాన్ని, బాల్యమిత్రులను, గురువులను ఎవరినీ మర్చిపోకుండా కథనాయకుడు సినిమాలో రజీనీకాంత్ ను తలపించారు కేసీఆర్. ఆయనలానే ఆనందబాష్పాలు, కన్నీళ్లు అన్నీ తెప్పించారు.
Tags:    

Similar News