కేసీఆర్ చెప్పారు.. అందరూ రాసుకోవాల్సిందే

Update: 2020-03-08 04:36 GMT
చిన్న పిల్లల మాదిరి మాట్లాడకండి. అప్పుడేం జరిగిందో గుర్తు లేదా? అప్పుడేం చెప్పారో మర్చియారా? లాంటి లొల్లి అసలే వద్దు. నచ్చి.. మెచ్చి.. ఎన్నికల్లో ఎన్నుకున్న తర్వాత అధినేత ఏం చెబితే అది వినాలి. అంతేకానీ అదే పనిగా గోల పెట్టకూడదు. కేసీఆర్ సారుది పెద్ద మనసు కాబట్టి.. అదే పనిగా గతాన్ని గుర్తు చేస్తూ చికాకు పెడుతున్నా.. మాటలతో సరి పెడుతున్నారు. తెలంగాణ ఉద్యమవేళ.. తెలంగాణ రాష్ట్ర సాధనే ఎజెండా. అందుకు ప్రజల్ని కార్మోన్ముఖుల్ని చేయటానికి మాటలు చెబితే.. అవన్నీ జరిగి పోవాలంటే సాధ్యమా? చెప్పండి. తెలంగాణ వస్తే.. అది చేయొచ్చు.. ఇది చేయొచ్చు అనుకోవచ్చు. ప్రాక్టికల్ గా పగ్గాలు చేతికి అందిన తర్వాత కదా తెలిసేది అసలు లోతు ఎంతో.

తెలంగాణ వస్తే ఇంటిలో ఉద్యోగమిస్తామన్న మాట కేసీఆర్ అన్నట్లుగా గుర్తు ఉంటే.. అలాంటి మాటల్ని మనసులో నుంచి చెరిపేయండి. ఎందుకంటే.. మీకు అలా గుర్తు ఉండి ఉండొచ్చు. కానీ.. కేసీఆర్ సారు ఎప్పుడూ అలా చెప్పలేదు. ఈ మాట ఎప్పుడు చెప్పారంటారా? దీనికి మాత్రం పక్కా రికార్డు ఉంటుంది. ఎందుకంటే.. ఇంతటి అపూర్వమైన మాట చెప్పింది తెలంగాణ అసెంబ్లీలోనే. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయనీ కీలక వ్యాఖ్య చేశారు. తాను తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమిస్తామని ఎప్పుడూ చెప్పలేదన్న ఆయన.. లక్ష ఇళ్లకు ఉద్యోగాలు వస్తాయని మాత్రమే చెప్పినట్లుగా స్పష్టం చేశారు. 

ఇంటికో ఉద్యోగమని విపక్షాలు అడుగుతున్నాయి కానీ.. కాంగ్రెస్.. టీడీపీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం ఇవ్వలేని ఉద్యోగాల్ని ఇస్తామని ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వదిలేయండి కేసీఆర్ సారూ.. మీగురించి.. మీ ప్రావీణ్యం గురించి తెలియక అలా నోరు పారేసుకుంటున్నారు కానీ.. మీరెప్పుడు ఏం చెప్పినా అదే రైట్ సరేనా? ఇప్పటికైనా అర్థమైంది కదా.. కేసీఆర్ చెప్పిన తాజా విషయాన్ని మనసులో రాసేసుకొని.. పాత గురుతులు ఏమైనా ఉంటే.. తుడిపేసుకోండి. అనవసరంగా సారుకు కోపం వచ్చేలా చేయకండే!


Tags:    

Similar News