కేసీఆర్.. కాంగ్రెస్.. పీకే.. ఫైనల్ ఫార్ములా ఇదేనట

Update: 2022-04-25 05:30 GMT
ఒక ఒరలో రెండు కత్తులు పట్టవు. అలాంటిది ఏకంగా మూడు కత్తుల్ని పెట్టేందుకు వీలుగా ప్రయత్నం చేస్తున్న పీకే ప్రయత్నాలు ఏ మేరకు సఫలం అవుతాయో చూడాలి. ఓవైపు కాంగ్రెస్ తో జత కట్టేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్న పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ సరికొత్త ఫార్ములాను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. శని.. ఆదివారాల్లో హైదరాబాద్ లోని కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ లో బస చేసిన ఆయన.. గంటల కొద్దీ సమయాన్ని గులాబీ బాస్ తో గడిపినట్లుగా తెలుస్తొంది.

ఈ సందర్భంగా జాతీయ.. రాష్ట్ర రాజకీయాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాల మీదా వారు మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. సుదీర్ఘంగా సాగిన వారి చర్చలు ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఇప్పటివరకు ఎవరూ అంచనా వేయలేని ఒక ఫార్ములాను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరే పక్షంలో వ్యాపారాల్ని పక్కన పెట్టేయాలని పీకేకు ఆ పార్టీ అధినాయకత్వం స్పష్టం చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను వ్యాపారం చేయకుండా రాజకీయాలకు పరిమితం కావటం.. అదే సమయంలో తన టీం వ్యాపార కార్యకలాపాలను చేపడుతుందన్న క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

దీంతో.. కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్సును మిస్ కాకుండానే.. గులాబీ పార్టీల మాదిరి పలు రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యహకర్తగా వ్యవహరించే అవకాశాన్ని చేజార్చుకునే అవకాశం ఉండదు. అంతేకాదు.. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ మోడీ పరివారానికి అనుకున్నంత మెజార్టీ రాకుండా.. కాంగ్రెస్ బలోపేతమై.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉంటే.. ఆ దశలో పీకే ఎంట్రీ ఇవ్వటం ద్వారా.. రోడ్ బ్లాకర్లను క్లియర్ చేసే వీలుంటుందన్న మాట వినిపిస్తోంది.

ప్రస్తుతానికి పరస్పర విరుద్ధ కాంబినేషన్లతో స్టేటస్ కో మొయింటైన్ చేస్తూనే.. మరోవైపు కొత్త అవకాశాలకు బాటలు వేసుకునేలా పీకే ప్లానింగ్ ఉందంటున్నారు. మూడో కూటమి ఏర్పాటైతే.. కాంగ్రెస్ ను కలుపుకోవాలన్న పీకే ఆలోచనకు ప్రాథమికంగా కేసీఆర్ ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.

బీజేపీని.. అందునా మోడీ పరివారాన్ని ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదని స్పష్టం చేయటం.. అందుకు తగ్గ ఉదాహరణల్ని వివరించటం ద్వారా కేసీఆర్ ను కన్వీన్స్  చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో.. కాంగ్రెస్.. కేసీఆర్.. పీకే లాంటి విచిత్రమైన కాంబినేషన్ తెర మీదకు వచ్చినట్లుగా చెప్పక తప్పదు. మరి.. పీకే ప్లానింగ్ ఎంతమేర వర్కువుట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News