మహారాష్ట్రలో కేసీఆర్‌ పోటీ ఇక్కడి నుంచేనా?

Update: 2023-05-12 12:06 GMT
టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు.. ఒడిశా, ఏపీ, మహారాష్ట్రలకు చెందిన వివిధ పార్టీ నేతలను బీఆర్‌ఎస్‌ లో చేర్చుకున్నారు. అయితే ముఖ్యంగా మహారాష్ట్రపైనే కేసీఆర్‌ అధిక దృష్టి సారించారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి కావడం, ఇక్కడ ఏకంగా 48 లోక్‌ సభా నియోజకవర్గాలు ఉండటం, రైతులు పెద్ద సంఖ్యలో ఉండటం, తెలంగాణకు సరిహద్దు రాష్ట్రం కావడం ఇందుకు కారణాలు.

ఈ నేపథ్యంలో తెలంగాణ బయట కేసీఆర్‌ ఇప్పటిదాకా నిర్వహించిన సభలన్నీ మహారాష్ట్రలోనే నిర్వహించడం గమనార్హం. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీకి కేసీఆర్‌ సిద్ధమవుతున్నట్టు టాక్‌ నడుస్తోంది. తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాలైన నాందేడ్‌ లేదా ఔరంగాబాద్‌ నుంచి కేసీఆర్‌ పోటీ చేయొచ్చని చెబుతున్నారు.

ఇప్పటికే కేసీఆర్‌ పోటీకి అనుగుణంగా బీఆర్‌ఎస్‌ నేతలు పావులు కదుపుతున్నారని అంటున్నారు. భారీ ఎత్తున నగదు తాయిలాలు ఆశచూపి క్షేత్ర స్థాయిలో వివిధ పార్టీల్లో ఉన్న చోటా మోటా నేతలను బీఆర్‌ఎస్‌ లో చేర్చుకునే పనిని ఆ పార్టీ నేతలు మొదలుపెట్టారని టాక్‌ నడుస్తోంది.

ఔరంగాబాద్‌ లో భారీ సంఖ్యలో ముస్లింలు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎంపీగా మజ్లిస్‌ పార్టీ నేత ఉన్నారు. తెలంగాణలో మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ చెప్పినట్టు కేసీఆర్‌ నడుచుకుంటున్నారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నచోట ఎంఐఎంకు సీట్లు కేటాయించి ఇందుకు ప్రతిఫలంగా ఔరంగాబాద్‌ సీటులో కేసీఆర్‌ పోటీ చేస్తారనే టాక్‌ నడుస్తోంది. మిత్ర ధర్మంలో భాగంగా మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఔరంగాబాద్‌ లో అత్యధిక సంఖ్యలో ఉన్న ముస్లింలను కేసీఆర్‌ వైపు తిప్పుతారని కేసీఆర్‌ ఆశిస్తున్నట్టు సమాచారం.

ఒకవేళ ఔరంగాబాద్‌ కాకుండా నాందేడ్‌ నుంచి పోటీ చేసినా అనుకూల పరిస్థితులు ఉంటాయని కేసీఆర్‌ లెక్కలు వేసుకుంటున్నారట. నాందేడ్‌ లో ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ అభ్యర్థి ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ బీజేపీ అభ్యర్థి ఎంపీగా ఉన్నారు. అయితే బీజేపీ ఇక్కడ వరుసగా గెలుపొందలేదు. 2004లో గెలుపొందాక మళ్లీ 2019లోనే ఇక్కడ గెలిచింది. ఈ నేపథ్యంలో నాందేడ్‌ ను తమకు అనుకూలంగా మార్చుకోగలిగితే కేసీఆర్‌ ఇక్కడ నుంచి పోటీ చేసినా గెలుపొందడం ఖాయమని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్‌ పోటీకి అనుకూలంగా ఇప్పటికే శివసేన, కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ తదితర పార్టీల నేతలకు భారీగా నగదు ఆశచూపి బీఆర్‌ఎస్‌ లో చేర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికల నాటికి ఔరంగాబాద్, నాందేడుల్లో ఏది అనుకూలంగా ఉంటే అక్కడి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తారని చెబుతున్నారు.

Similar News