వైఎస్ ను తలచుకున్న కేసీఆర్ తనయ

Update: 2016-10-21 10:13 GMT
తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమంటూ టీఆరెస్ ఎంపీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత మహానేతను గుర్తు చేసుకున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె తాము కూడా సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తున్నామని.. గత రెండేళ్లుగా తెలంగాణ సంస్కృతికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చన్నారు. దేశ విదేశాల్లో బతుకమ్మకు విశేష ఆదరణ లభించిందన్నారు. అక్కడి ప్రభుత్వాలు కూడా బతుకమ్మ పండుగను గుర్తించాయన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతిని, బతుకమ్మ పండగలను ప్రస్తావిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆమె గుర్తు చేసుకున్నారు. తెలుగు భాష వ్యాప్తికి ఎంతో కృషి చేశారని, ఆయన కృషి వల్లే తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కవులు, కళాకారులను గౌరవించుకోగలిగామన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు బహుభాషా కోవిదుడు అయినప్పటికీ...ఆయనకు సొంతగడ్డపై  రావాల్సినంత కీర్తిప్రతిష్టలు రాలేదన్నారు.

కాగా తెలంగాణ ప్రభుత్వంలో మహిళలు మంత్రి పదవుల్లో లేకపోవడం పెద్ద సమస్య కాదని, మహిళాభ్యుదయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని కవిత చెప్పుకొచ్చారు.  మహిళలకు మంత్రి పదవులు దక్కాలన్న కోరిక తనకుందని, అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పేంత పెద్దదాన్ని  కాదని వ్యాఖ్యానించారు. సమయం వచ్చినపుడు మహిళలకు పదవులు వాతంటత అవే వస్తాయని అన్నారు.
Tags:    

Similar News