ఢిల్లీ లిక్క‌ర్ కేసులో కేసీఆర్ కుమార్తె పాత్ర ఉంది: బీజేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-08-22 04:14 GMT
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులపై బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు సంచలన ఆరోపణలు చేశారు.

ఢిల్లీ ఒబేరాయ్ హోటల్‌లో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన చేశారని, పైసలు ఇవ్వడం, తీసుకోవడంలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పెద్ద పాత్ర పోషించారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. ఢిల్లీ డిప్యూటీ సిఎం, ఎక్సైజ్ కమిషనర్, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో కవిత, దక్షిణాదికి చెందిన లిక్కర్ ప్రతినిధులు డీల్‌కు వచ్చారని ఆయన చెప్పారు.

ఒబెరాయ్ హోటల్‌లో కవిత మీటింగ్ నిర్వహించి చద్దా పరివార్ నుంచి డబ్బులు తీసుకుని పంజాబ్‌లో మద్యం ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయించారని ఆరోపించారు. లిక్కర్ పాలసీలో అవినీతి ఒబెరాయ్ హోటల్ నుంచే ప్రారంభమైందని, మూడు కోట్ల రూపాయ లు క్యాష్ రూపంలో ఇచ్చారని చెప్పారు. అలాగే కోటిన్నర రూపాయలు క్రెడిట్ రూపంలో అందించే ప్రయత్నం చేశారని మంజిం దర్ సింగ్ సిర్సా ఆరోపించారు. 2 శాతం ఉన్న కమిషన్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 12 శాతానికి పెంచారని సిర్సా చెప్పారు.

కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్, ఢిల్లీ ఎన్ 1 లైసెన్స్ హోల్డర్స్ వ్యక్తుల ద్వారా కుదిరిన డీల్‌‌లో భాగంగా మనీశ్ సిసోడియాకు 150 కోట్ల రూపాయలిచ్చారని బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ ఆరోపించారు. దీనికి బదులుగా ముందుగా ఎన్ 1 కమిషన్, లాభాలు తీసుకునేలా డీల్ కుదిరిందన్నారు. పంజాబ్, తెలంగాణ, పశ్చిమ్ బెంగాల్‌లో ఇదే లిక్కర్ పాలసీ అమలు అవుతోందని పర్వేశ్ సాహిబ్ సింగ్ చెప్పారు.

మరోవైపు మద్యం స్కామ్‌లో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఏ1గా చేర్చింది. 120-బీ, 477-ఏ సెక్షన్ల ప్రకారం ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చారు. సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లు ఈ ఎఫ్‌ఐఆర్‌‌లో ఉన్నాయి. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌‌లో నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ పేరు కూడా ఉంది. ఢిల్లీ మద్యం విధానంపై దాఖలైన కేసులో భాగంగా సిసోడియా నివాసంతో పాటు 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతోపాటు మొత్తం 21 చోట్ల సీబీఐ అధికారులు  దాడులు నిర్వహించారు.

గత ఏడాది నవంబర్‌లో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు, విధానపరమైన లోపాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికలో ఉంది. దీంతో ఈ నివేదికపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇంఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్ర గురించి కూడా నివేదికలో ఉంది. దీంతో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.
Tags:    

Similar News