చెబితే నమ్మరు కానీ.. కేసీఆర్ కోరికలు తీరటం లేదట

Update: 2019-12-21 06:45 GMT
ఛత్.. ఎదవ జీవితం.. అనుకున్నదేదీ జరగదంటూ నిత్యం అనుకునేటోళ్లు కోట్లల్లో ఉంటారు.  ఇలాంటివి సామాన్యులే కాదు.. పవర్ ఫుల్ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ లాంటోళ్లు కూడా అనుకుంటారా? అంటే అవునని చెప్పాలి. సగటు సామాన్యుడి మాదిరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాట ఆశ్చర్యకరంగా మారింది.

మాకూ కోరికలు ఉంటాయి..కానీ.. అవి తీరవన్న ఆయన ఏ సందర్భంలో అన్నారు? ఇంతకీ ఆయన కోరిక ఏమిటో తెలిస్తే కాస్త సిత్రమనిపించిక మానదు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు హైదరాబాద్ లో ఇస్తున్న ప్రవచనాల ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. తాను వారంలో ప్రతిరోజూ చాగంటి ప్రవచనాలు వినాలని అనుకున్నానని.. కానీ సాధ్యం కాలేదన్నారు.

‘‘మాకూ కోరికలు ఉంటాయి. వాటిని కూడా తీర్చుకోలేం. చాగంటి ప్రవచనాలు వినాలని అనుకుంటున్నా కుదర్లేదు. ఇవాళ వేరే కార్యక్రమాలు రద్దు చేసుకొని మరీ వచ్చా. ఆయన నోటి నుంచి వచ్చే ప్రవచనాలు వినే భాగ్యం ఈ రోజు కలిగింది’’ అని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది. అనుకుంటాం కానీ అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు చిటిక వేస్తే అన్ని పనులు అయిపోతాయని.. కానీ కుదరవన్న సత్యాన్ని కేసీఆర్ తన మాటలతో కళ్లకు కట్టినట్లు చెప్పారని చెప్పక తప్పదు. సో.. మనం అనుకున్నవేమీ అవ్వట్లేదన్న అనవసరమైన బాధను వదిలేయండి.. కేసీఆర్ లాంటోడికే కోరికలు తీరకున్న వేళ.. మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని లేదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News