మోడీకే కేసీఆర్ సలహాలు ఇచ్చారా? 1

Update: 2016-02-14 06:55 GMT
కొద్ది నెలల తర్వాత.. పలు ప్రయత్నాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఫిక్స్ అయ్యింది. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు దాదాపు 50 నిమిషాల పాటు ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ సాగింది. ఇందులో మిగిలిన ప్రక్రియల్ని వదిలేస్తే దాదాపు 30 నిమిషాలకు పైనే మోడీతో కేసీఆర్ సంభాషణ జరిపారు. ఏకాంతంగా సాగిన ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.

అత్యంత విశ్వసనీయ వర్గాలు అంటూ ఒక ప్రముఖ మీడియా సంస్థ వెలువరించిన కథనం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వారి కథనం మొత్తాన్నిమూడు ముక్కల్లో చెప్పాలంటే.. ఓపెన్ మైండ్ తో తాను మాట్లాడతానని.. మీకు నచ్చుతుందా? అన్న మాటను అడిగి మరీ.. మోడీ మార్క్ కనిపించే విధంగా ఇప్పటివరకూ ఏ పథకం అమలు కాలేదని.. రెండు బడ్జెట్లు సోసోగా ఉన్నాయని.. ఇక మిగిలింది మూడు బడ్జెట్లేనని.. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలేమీ అమలు కావటం లేదన్న విషయాన్ని సూటిగా చెప్పేసినట్లుగా కథనం సాగింది.

ఇక్కడ ప్రశ్నలేమంటే.. మోడీతో అంత నేరుగా.. ఓపెన్ గా కేసీఆర్ మాట్లాడి ఉండారా? ఆయన కేసీఆర్ కు ఆ అవకాశాన్ని ఇస్తారా? ఏకాంతంగా సాగిన ఇరువురి మధ్య విషయాల్లో కేసీఆర్ ఇమేజ్ ను బిల్డ్ చేసే మాదిరి.. ఆయన్ను వ్యతిరేకిస్తారన్న పేరున్న ప్రధాన మీడియా సంస్థలో కథనం రావటం ఏమిటి? విశ్వసనీయ వర్గాలంటే ఎవరు? మోడీ.. కేసీఆర్ మధ్యన జరిగిన చర్చల వివరాలు వెల్లడించే అవకాశం ఎవరికి ఉంది? మోడీ ఇమేజ్ ను తగ్గించేలా.. మోడీకే సలహాలు ఇవ్వగల మొనగాడిగా కేసీఆర్ ను కీర్తించేలా కథనం రావటానికి అవసరమైన ‘విశ్వసనీయ సమాచారం’ ఎవరు ఇచ్చినట్లు? అన్నవి ప్రధాన ప్రశ్నలు.

ఈ ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే..? కేసీఆర్ మనస్తత్వంలో ఆయనకు ఏదైనా అనిపిస్తే చెప్పేసే అలవాటు ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. సలహాలు ఇవ్వటం.. తనకు తెలిసింది చెప్పటం కేసీఆర్ ను దగ్గరగా చూసే వారికి తెలిసిన విషయాలే. పాత విషయాల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే.. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఏపీ తెలంగాణల మధ్య విభజన లొల్లి నడుస్తున్న సమయంలో గవర్నర్ సమక్షంలో భేటీ అయిన సందర్భంగా ఏపీ రాజధానికి సంబంధించి.. వాస్తుకు సంబంధించి చంద్రబాబుకు కేసీఆర్ సలహాలు ఇవ్వటాన్ని మర్చిపోకూడదు.

ఏ విషయం మీదనైనా సరే.. లోతుగా అధ్యయనం చేయటం.. తాను తెలుసుకున్న విషయాల్ని చెప్పటం లాంటివి కేసీఆర్ కు అలవాటే. ఈ నేపథ్యంలో మోడీకి కేసీఆర్ సలహాల రూపంలో తనకు అనిపించిన విషయాల్ని చెప్పే అవకాశం ఉందనే చెప్పాలి. ఇదే కథనంలో ప్రస్తావించిన మరో అంశాన్ని చూస్తే.. కేసీఆర్ కు మోడీ ఆ అవకాశం ఎలా ఇచ్చారో కూడా అర్థమవుతుంది. నేను ఓపెన్ మైండ్ తో మాట్లాడితే మీకు నచ్చుతుందో? లేదో? అని ఆగటం.. దానికి మోడీ ‘‘చెప్పండి’’ అంటూ సైగ రూపంలో ఓకే అనటం చూసినప్పుడు.. కేసీఆర్ మాట్లాడే అవకాశం మోడీ స్వయంగా ఇచ్చినట్లుగా స్పష్టమవుతుంది.
Tags:    

Similar News