ముంద‌స్తు స్కెచ్ కు వేదిక రాజ్ భ‌వ‌నా?

Update: 2018-08-31 11:08 GMT
ఒక్కొక్క చిక్కుముడి వీడిపోతోంది. ముంద‌స్తు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి గ‌డిచిన కొద్ది నెల‌లుగా చేసిన క‌స‌ర‌త్తు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తోంది. దేశంలో మ‌రే రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేయ‌న‌ట్లుగా.. కేసీఆర్ త‌రచూ రాజ్ భ‌వ‌న్ కు వెళ్ల‌టం.. గ‌వ‌ర్న‌ర్ తో గంట‌ల కొద్దీ మాట్లాడ‌టం చేసేవారు. ఏ ముఖ్య‌మంత్రి కూడా తాను చేసే ప‌నుల్ని గ‌వ‌ర్న‌ర్ కు షేర్ చేయ‌టం క‌నిపించ‌దు.

అందుకు భిన్నంగా కేసీఆర్ త‌ర‌చూ మీటింగ్ కావ‌టం దేని గురించి? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికేది కాదు. తాజాగా మాజీ కేంద్ర‌మంత్రి బండారు ద‌త్తాత్రేయ చేసిన వ్యాఖ్య చూస్తే.. ముంద‌స్తుకు సంబంధించిన స్కెచ్ కాస్త అర్థ‌మైన‌ట్లుగా చెప్పాలి. ఏపీకి వ‌చ్చిన పార్టీ అధినేత అమిత్ షాను తాను కలిసిన‌ప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముంద‌స్తు గురించి త‌న‌కు చెప్పిన వైనాన్ని తాజాగా ఆయ‌న చెప్పారు.

ముంద‌స్తు ప‌క్కా అని తేల్చేయ‌ట‌మే కాదు... ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు అవ‌స‌ర‌మైన అభ్య‌ర్థుల కోసం పార్టీ రెండు నెల‌లుగా క‌స‌ర‌త్తు చేస్తున్న వైనాన్ని చెప్పారు. అంటే.. కేసీఆర్ మ‌దిలోని ఆలోచ‌న అమిత్ షాకు ఎలా తెలిసింది? అన్న‌ది చూస్తే.. కేసీఆర్ కు మోడీషాల‌కు మ‌ధ్య‌నున్న ర‌హ‌స్య స్నేహం ఇట్టే అర్థం కాక మాన‌దు.

అంతేకాదు.. వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహ‌బంధం మ‌రింత బ‌ల‌ప‌డేలా చేయ‌టం కోసం గ‌వ‌ర్న‌ర్ త‌న వంతు పాత్ర‌ను తాను చ‌క్క‌గా నిర్వ‌ర్తించిన‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాలు చెప్పే మాట‌లు బ‌లం చేకూరుస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రెండు నెల‌ల క్రిత‌మే అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తును పార్టీ చేప‌ట్టింద‌ని ద‌త్త‌న్న‌చెప్పింది చూస్తే.. ముంద‌స్తు ఆలోచ‌న‌ను గ‌డిచిన ఆరు నెల‌లుగా కేసీఆర్ మ‌దిలో ఉన్న‌ట్లుగా అర్థం కాక మాన‌దు.

ముంద‌స్తుకు వెళ్లాల‌న్న త‌న ప్లాన్ కు కేంద్ర స‌హ‌కారం త‌ప్ప‌నిస‌రి కావ‌టంతో.. త‌న‌కు నేరుగా బీజేపీ అధినాయ‌క‌త్వంతో సంబంధాలు లేని నేప‌థ్యంలో.. విశ్వ‌స‌నీయ వ్య‌క్తిగా గ‌వ‌ర్న‌ర్ ను కేసీఆర్  న‌మ్మిన‌ట్లుగా టీఆర్ ఎస్ కు చెందిన ఒక ముఖ్య‌నేత చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఇదంతా చూసిన‌ప్పుడు..త‌న మదిలో ఉన్న‌ ముంద‌స్తు ఆలోచ‌న‌ను గ‌వ‌ర్న‌ర్ ముందు పెట్టి.. దానికి త‌గ్గ స్కెచ్ ప‌క్కాగా వేసుకున్న త‌ర్వాత‌.. ఆ విష‌యాన్ని మోడీషాల‌కు చేర‌వేయ‌టం.. వారి అనుమ‌తి త‌ర్వాతే.. అస‌లు క‌స‌ర‌త్తు మొద‌లైందా? అన్న సందేహాలు క‌లిగేలా తాజా ప‌రిణామాలు ఉన్నాయ‌ని చెప్పాలి.

తాజాగా ఎయిర్ పోర్ట్ లో షాను క‌లిసిన బీజేపీ నేత‌లు.. ముంద‌స్తు కార‌ణంగా పార్టీ మునిగిపోతుంద‌న్న మాట తెలంగాణ క‌మ‌ల‌నాథులు చెప్పినా.. అమిత్ షా పెద్ద‌గా రియాక్ట్ కాక‌పోవ‌ట‌మే కాదు.. కేసీఆర్ నిర్ణ‌యానికి పాజిటివ్ గా రియాక్ట్ కావ‌టం చూస్తుంటే.. ముంద‌స్తు వ్య‌వ‌హార‌మంతా ప‌క్కా ప్లానింగ్ తో జ‌రిగిన‌ట్లుగా అర్థం కాక మాన‌దు.
Tags:    

Similar News