తిరుమలకు కేసీఆర్ ఎలా వస్తున్నారంటే...

Update: 2017-02-20 09:15 GMT
రాజు వెడలె రవితేజములలరగ అన్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ అంగరంగ వైభవంగా స్వర్ణాభరణాలు. సపరివార సమేతంగా ఏడుకొండలవాడి చెంతకు వస్తున్నారు. అయితే.. కేసీఆర్ ఎలా వస్తున్నారు.. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయన్నది చూస్తే అబ్బో అనిపించకమానదు. కేసీఆర్ కోసం తిరుమలతో సకల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిపోయాయి. ఆయన రాక కోసమే నిరీక్షిస్తున్నారు. ప్రత్యేకంగా రెండు విమానాల్లో ఆయన - ఆయన పరివారం వస్తున్నారు.
    
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి చెల్లించాల్సిన మొక్కు చెల్లించుకుని, ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఆభరణాలను సమర్పించుకునేందుకు రెండు ప్రత్యేక విమానాల్లో కేసీఆర్ రేపు ఏపీకి రానున్నారు. తన కుటుంబ సభ్యులు - పలువురు మంత్రులు - వారి కుటుంబీకులతో కలసి మంగళవారం సాయంత్రం రేణిగుంటకు వారంతా చేరుకుంటారు. ఆ తరువాత రాత్రికి తిరుమలలోనే విశ్రమించి బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. కేసీఆర్ - ఆయన కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ - శ్రీవత్సం విశ్రాంతి గృహాల్లోను - మంత్రులకు - ఇతరులకు శ్రీ - లీలావతి - మణిమంజరి - టీఎస్ ఆర్ గెస్టు హౌస్ లలోను బస ఏర్పాట్లు చేశారు.
    
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినందుకు రూ. 5.59 కోట్లతో కేసీఆర్ బంగారు ఆభరణాలను తయారు చేయించిన సంగతి తెలిసిందే. రూ. 5.59 కోట్ల విలువైన సాలగ్రామ హారం - కంఠాభరణాలను వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించుకుంటారు. అనంతరం తిరుపతిలోని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముక్కుపుడకను సమర్పించుకుంటారు.  గతంలో టీటీడీ కార్యనిర్వాహక అధికారిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి రమణాచారి ఈరోజు తిరుమల పయనమవుతున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్ కూడా తిరుమల వెళ్లి, అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News