కేసీఆర్ ఫైరింగ్ బొంతుకు అనుభవమైంది

Update: 2016-08-04 04:34 GMT
తియ్యగా మాట్లాడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టంగా ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకునే ఆయన.. లెక్క తేడా వస్తే బండకేసి ఎలా బాదుతారో అందరకి తెలిసిన విషయమే. తన మన అన్న తేడా లేకుండా ఈ చాకిరేవు ఉంటుంది. హైదరాబాద్ మేయర్ గా ఏరి కోరి ఎంపిక చేసుకున్న బొంతు రామ్మోహన్ కు అధినేత ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో తాజాగా అనుభవంలోకి వచ్చిందంటున్నారు. వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరంలో రోడ్ల దుస్థితి దారుణంగా మారటం.. ట్రాఫిక్ కష్టాలతో జనాలు అల్లాడుతున్న వేళ.. మేయర్ వరుసగా ఫారిన్ టూర్లకు వెళ్లటంపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు చెబుతున్నారు.

గడిచిన రెండేళ్లలో ఏ విషయం మీద జరగనంత రచ్చ రెండు అంశాల మీద జరిగిందని చెప్పాలి. అందులో ఒకటి మల్లన్నసాగర్ అంశం అయితే.. రెండోది వర్షాల కారణంగా దారుణంగా దెబ్బతిన్న హైదరాబాద్ రోడ్ల ఇష్యూ​.
ప్రధాన రహదారులన్నీ రోడ్లు ఉన్నాయా? లేవా? అన్నట్లుగా మారి.. గుంతలతో నిండిపోయిన వైనం లక్షలాది హైదరాబాదీయులకు సినిమా చూపిస్తోంది. కేసీఆర్ సర్కారు మీద వ్యతిరేకంగా రాతలు రాయని మీడియా సంస్థలు సైతం.. రోడ్ల దుస్థితి మీద ప్రత్యేక కథనాల్నే అందించిన పరిస్థితి.

రోడ్ల నిర్వహణతోపాటు.. జీహెచ్ ఎంసీ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేసీఆర్.. తాజాగా ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్ కు గ్రేటర్ ఉన్నతాధికారులతో పాటు మేయర్ కూడా హాజరయ్యారు. మీటింగ్ అయ్యాక.. అధికారులు వెళ్లిన తర్వాత మేయర్ బొంతు రామ్మోహన్ కు కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఫారిన్ టూర్లు వెళ్లటంపై సీరియస్ అయిన ఆయన.. ఫారిన్ ఎందుకు.. ఇక్కడ పని లేదా? అని అడిగినట్లుగా చెబుతున్నారు.

మన పని మనం చూసుకోవాలే కానీ.. ఫారిన్ టూర్లు అవసరమా? అని సూటిగా ప్రశ్నించటమే కాదు.. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని హెచ్చరించినట్లుగా చెబుతున్నారు. మేయర్ బొంతు రెండు నెలల కిందట ఫ్రాన్స్ వెళ్లగా.. నాలుగు రోజుల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లటం.. మరోవైపు గ్రేటర్ రోడ్లు దారుణంగా మారి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో బొంతు మీద కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News