బాబును కేసీఆర్ ఎన్ని మాట‌లు అన్నారంటే..?

Update: 2017-05-30 04:10 GMT
సినిమాల్లో కొన్ని కాంబినేష‌న్ల‌కు ఉండే ఆద‌ర‌ణే వేరు ఉంటుంది. ఇక‌.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస‌రికి ఇది కాస్త భిన్నం. కొన్ని కాంబినేష‌న్ల మ‌ధ్య‌న‌డిచే మాట‌ల యుద్ధం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఏ చిన్న తేడా వ‌చ్చినా  ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఒంటి కాలిపై విరుచుకుప‌డేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అస్స‌లు సంకోచించ‌రు. అదే కేసీఆర్.. త‌న‌కు బాబు కానీ ఎదుట‌ప‌డితే న‌వ్వుతూ మాట్లాడ‌టం క‌నిపిస్తుంది. ఇదెలా సాధ్య‌మ‌ని చాలా మంది ప్ర‌శ్నిస్తుంటారు. ఎందుకంటే.. ఒక అధినేత‌ను తీవ్ర‌స్థాయిలో తిట్ల వ‌ర్షం కురిపించిన త‌ర్వాత‌.. వ్య‌క్తిగ‌తంగానూ.. రాజ‌కీయంగానూ తీవ్ర విమ‌ర్శ‌లు సంధించిన త‌ర్వాత అంత మామూలుగా ఎలా ఉంటార‌న్న‌ది అర్థం కాని క్వ‌శ్చ‌న్ మార్కే. కాస్త వెన‌క్కి వెళితే.. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న సైతం చంద్ర‌బాబుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసేవారు.

రాజ‌కీయాల్లో భాగంగా ఇద్ద‌రి మ‌ధ్య న‌డిచే మాట‌ల యుద్ధం.. కొంత‌కాలానికి ఎంత‌లా పెరిగిపోయిందంటే.. ఒక‌రికొక‌రు ఎదురుపడినా క‌నీసం చూసేందుకు సైతం ఇష్ట‌ప‌డని వ‌ర‌కూ వెళ్లింది. అయితే.. ఇలాంటి ప‌రిస్థితి ఇద్ద‌రి చంద్రుళ్ల కాంబినేష‌న్లో అస్స‌లు క‌నిపించ‌దు. దీనికి కార‌ణం కూడా కేసీఆరే. ఎందుకంటే..రాజ‌కీయంగా తేడా వ‌చ్చిన‌ప్పుడు దుమ్ము దులిపిన‌ట్లుగా బాబుపై తిట్ల వ‌ర్షం కురిపించే  కేసీఆర్‌.. బాబు ఎదురుప‌డిన‌ప్పుడు మాత్రం రాజ‌కీయ వైరాన్ని వ‌దిలేసి మామూలుగా మాట్లాడ‌టం కూడా కార‌ణంగా చెబుతారు.

కేసీఆర్ వైఖ‌రి అర్థంకాని ఫ‌జిల్ మాదిరి ఉంటుంద‌ని చంద్ర‌బాబే త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర అంటుంటార‌ని చెబుతారు. మైకుల ముందు అంత దారుణంగా మాట్లాడే వ్య‌క్తి.. విడిగా క‌లిసిన‌ప్పుడు మాత్రం చాలా మ‌ర్యాద‌గా మాట్లాడ‌తుంటార‌ని.. కొన్నిసార్లు అస్స‌లు అర్థ‌మే కాద‌న్న మాట బాబు నోటి వెంట వ‌స్తుంటుంద‌ని చెబుతుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా చంద్రబాబుపై మ‌రోసారి మండిప‌డ్డారు కేసీఆర్‌.

విశాఖ‌లో నిర్వ‌హిస్తున్న మ‌హానాడులో భాగంగా తెలంగాణ‌లో అధికారాన్ని చేజిక్కించుకునే దిశ‌గా ప‌య‌నిస్తామ‌న్న మాట‌ను చంద్ర‌బాబు చెప్ప‌టంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌న‌దైన శైలిలో నోటికి ప‌ని చెప్పారు. చంద్ర‌బాబుపై కేసీఆర్ చేసిన తీవ్ర విమ‌ర్శ‌ల్ని చూస్తే.. త‌మ స‌ర్కారు ఎన్నిక‌ల హామీల్ని నూటికి నూరు శాతం అమ‌లు చేసింద‌ని.. రూ.17వేల కోట్ల‌తో పూర్తిస్థాయి రైతుల రుణ‌మాఫీని అమ‌లు చేసిన‌ట్లుగా చెప్పారు.

అదే స‌మ‌యంలో ప‌క్క రాష్ట్రంలో చంద్ర‌బాబు మాత్రం మోసం చేశార‌ని మండిప‌డ్డారు. "ప‌క్క రాష్ట్రంలో చంద్ర‌బాబు చేయ‌లేదు. మోసం చేసిండు. నిన్న మాట్లాడుతున్నాడు ఆయ‌న‌. ఆంధ్రా రైతుల‌కు.. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు శ‌ఠ‌గోపం పెట్టి ఇక్క‌డ‌కు వ‌చ్చి ఎల‌గ‌బెడ‌త‌డ‌ట‌. వ‌చ్చి రైతుల‌కు.. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పు. నువ్వు చెప్పింది ఏంది? అంద‌రికీ మేలు చేస్తాన‌న్నావు. రైతుల‌కు.. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణాలు మాఫీ చేస్తాన‌న్న మాట‌ను చెప్పావు. మాట‌ను మార్చావు. తిమ్మ‌ని బ‌మ్మిని చేశావు. తెలంగాణ‌లో నీకు స్థానం లేదు. నీ క‌థ ఇక్క‌డ అయిపోయింది. తెలంగాణ‌కు వ‌చ్చినా నీకు వ‌చ్చేదేమీ లేదు. నీకు డిపాజిట్లు కూడా రావు" అని విరుచుకుప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News