మహాత్ముడిపై వెకిలి.. మకిలి చేష్టలు.. వజ్రోత్సవ సందేశంలో కేసీఆర్ మండిపాటు

Update: 2022-08-09 06:30 GMT
ఒక పద్దతి ప్రకారం కేసు బిల్డ్ చేసే తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో కనిపిస్తూ ఉంటుంది. తనకు నచ్చని విషయం మీద ఒక క్రమపద్దతిలో ఆయన ఎదురుదాడి మొదలు పెడతారు. ఇందులో భాగంగా తొలుత విమర్శలు మొదలుపెట్టి.. ప్రజల మనసుల్ని ట్యూన్ చేసేలా మాట్లాడే టాలెంట్ ఎంతన్న విషయం తెలిసిందే.

ఇటీవల కాలంలో కేంద్రంలోని మోడీ సర్కారుపై విరుచుకుపడుతున్న కేసీఆర్.. తనకు లభించిన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు. ఇటీవల కాలంలో వార్ ఓపెన్ అయిపోవటం.. ముంచుకొచ్చిన మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. కేసీఆర్ తన మాటలకు మరింత పదును పెట్టారు.

ఈసారి కొత్తగా జాతిపిత మహాత్మగాంధీని అసరాగా చేసుకొని.. అంత గొప్ప మహానుభావుడి మీదా మీ చిల్లర మాటలు? అంటూ మండిపడ్డారు.మహాత్ముడిపై విమర్శలు చేస్తున్నారంటూ విరుచుకుపడుతూ. మకిలి.. వెకిలి వ్యాఖ్యలు ఏమిటి? అంటూ ప్రశ్నించారు.
గాంధీజీ విశ్వమానవుడని..అటువంటి మహాత్ముడిపై వెకిలి.. మకిలి చేష్టలు చేయటం దారుణమన్న ఆవేదనను వ్యక్తం చేశారు. గాంధీజీని కించపరిచే దురద్రష్టకర సంఘటనలు ఇటీవల చూస్తున్నామని.. అదేమాత్రం మంచిది కాదన్నారు. ఇలాంటివి ఎక్కడ జరిగినా ఖండించాలన్నారు. కేసీఆర్ మాటల్లో కీలక వ్యాఖ్యల్ని చూస్తే..

-  దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలను భావితరాలకు చాటాలి. ఆ పోరాట స్ఫూర్తిని వారిలో రగించాలి. వజ్రోత్సవ దీప్తిని ఊరూరా చాటాలి.

-  నేను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న  సమయంలో.. ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పార్లమెంట్‌ సంయుక్త సమావేశంలో చేసిన ప్రసంగంలో గాంధీజీ గురించి ప్రస్తావించారు. ఒబామా మాట్లాడుతూ.. ‘గాంధీజీ ఈ ప్రపంచంలో పుట్టకపోయి ఉంటే... ఒబామా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదు’ అని ఆయన అన్నప్పుడు భారతీయులందరి గుండెలూ పులకించిపోయాయి.

-  ప్రపంచవ్యాప్తంగా.. ఐన్‌స్టిన్‌, నెల్సన్‌ మండేలా వంటి ఎందరో ప్రముఖులకు మహాత్ముడే స్ఫూర్తి.  గాంధీ, నెహ్రూ తదితర స్వాతంత్య్ర సమరయోధులు.. సంస్థానాలన్నింటినీ విలీనం చేయడం ద్వారా దేశాన్ని ఒకటి చేస్తే, ఇప్పుడు కొన్ని చిల్లర మల్లర ప్రయత్నాలతో జాతిని చీల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి కుట్రలను ఖండించాలి.

-  వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేయాలి.
Tags:    

Similar News