ప్రతిపక్షాలపై కేసీఆర్ ఓపెన్ ‘‘ఫైరింగ్’’

Update: 2015-08-09 04:49 GMT
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంతగా మంట పుట్టిస్తుందనటానికి తాజాగా సమాధానం దొరికింది. తన మాట కాదని సమ్మె చేసిన వారిపై కత్తి కట్టిన కేసీఆర్.. వెనుకా ముందు చూడకుండా వెయ్యి మంది వరకు ఉద్యోగాలు తీయించిన తీరును సమర్థించుకోవటమే కాదు.. గంటల కొద్దీ వెయిట్ చేసినా.. విపక్షాలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటమేకాదు.. సీఎం తమను కలిసేందుకు సమయం ఇవ్వని వైనంపై ధర్నా చేసిన విపక్ష నేతల్ని అదుపులోకి తీసుకోవటాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓపెన్ గా సమర్థించుకున్నారు.

కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన బహిరంగ సభలో మాట్లాడిన సందర్భంగా విపక్షాలపై ఓపెన్ గా ఫైరింగ్ చేసేశారు. ప్రతిపక్షాల తీరును తీవ్రంగా విమర్శించిన ఆయన.. తాను చేస్తున్న పనుల్ని ఎంతగా సమర్థించుకున్నారన్నది సీఎం కేసీఆర్ మాటల్లోనే వింటే..

‘‘ఏం పని లేక ఏదో ఒక పని కల్పించుకొని సెక్రటేరియట్ కు వచ్చి దర్వాజాకు అడ్డంగా నిలబడితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ల పెట్టక ఏం జేస్తరు? మీకు తగిన శాస్తి జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి’’ (సీఎంను కలవటానికి వచ్చి.. ఆయన సమయం ఇవ్వకపోవటంతో నిరసన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వైనాన్ని ప్రస్తావిస్తూ)

‘‘మీ యూనియన్ బాజీలు.. పనికిమాలిన దందాలు బంద్ పెట్టండి. ఇక మీ పప్పులుడకవ్. భయపడే ప్రభుత్వం ఇక్కడ లేదని హెచ్చరిస్తున్నా’’

‘‘ప్రతిపక్షాలను ఒక్క మాట అడుగుతున్నా. గ్రామ పంచాయితీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ దిక్కుమాలిన సమ్మె చేస్తుండ్రు కదా. కమూనిస్టు సర్పంచులున్న చోట కార్మికులకు జీతాలు పెంచండి. తెల్లారి నుంచే మేం కూడా పెంచుతాం. ఎందుకంటే.. పారిశుద్ధ్య కార్మికులకు ఏ గ్రామానికి ఆ పంచాయితీ.. ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీనే జీతాలు ఇస్తుంది తప్ప ప్రభుత్వం కాదు. 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్ర సర్కారైనా జీతాలు ఇస్తున్నరా?’’

‘‘సమ్మె మేం చేయించినా.. మరే పరిష్కరించాలని వారు చెబుతున్నరు. అందుకే వారికి ఇంటర్వ్యూ ఇవ్వలె. ప్రజలు మాకు అధికారమిచ్చిండ్రు. తప్పు చేస్తే మాకు శిక్ష విధిస్తరు. అంతవరకు ఎదురుడూడాలేగానీ.. పొద్దున లేస్తే ఏదో బురద చల్లాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తే ఎట్లా? మీ పుణ్యమా అని జీహెచ్ఎంసీలో వెయ్యి మంది కార్మికుల ఉద్యోగాలు పోయినయ్. ఇకనైనా మీ యూనియన్ బాజీలు.. పనికిమాలిన దందాలు బంద్ జేసుకోవాలె’’
Tags:    

Similar News