మంత్రులపై కేసీఆర్ కోపం కట్టలు తెగిందా?

Update: 2015-09-20 04:22 GMT
దేశం కాని దేశంలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను అంతకంతకూ పెంచేస్తూ.. పెట్టుబడుల వరద పారించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కిందామీదా పడుతున్న సంగతి తెలిసిందే. తన తాజా చైనా పర్యటన విజయవంతమైందన్న ఆనందంలో కేసీఆర్ లో కనిపించటం లేదు. ఎందుకంటే.. తన సహచర మంత్రుల పనితీరే అన్న భావన వ్యక్తమవుతోంది.

తన పది రోజుల చైనా పర్యటన సమయంలో.. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు సంఘటనల విషయంలో సహచర మంత్రుల పని తీరు.. వైఖరిపై కేసీఆర్ గుర్రుగా ఉండటమే కాదు.. తన మనసులోని మాటను తాజా మంత్రివర్గ సమావేశాల్లో చెప్పేసినట్లుగా చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల విషయంలో వ్యవసాయ మంత్రి.. అధికారుల పనితీరుపై పెదవి విరిచిన కేసీఆర్.. సంబంధిత మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పై కట్టలు తెగిన కోపంతో సీరియస్ అయ్యారని చెబుతున్నారు.

పని తీరు బాగోలేదని సూటిగా చెప్పేయటంతో పాటు.. తాజాగా చోటు చేసుకున్న రైతుల ఆత్మహత్యల విషయంలో సమర్థంగా స్పందించలేదని.. పద్దతి మార్చుకోవాలంటూ క్లాస్ పీకారంటున్నారు.  ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడిన సమయంలో.. వాటిని సమర్థంగా తిప్పికొట్టాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్యవహరించారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పలువురు మంత్రుల తీరును పేరు పేరునా ప్రస్తావించి వారిలో కొత్త గుబులును రేపారంటున్నారు

మిగిలిన మంత్రుల విషయం ఎలా ఉన్నా.. వ్యవసాయ మంత్రి పోచారం.. మరో మంత్రి జగదీశ్ రెడ్డిల తీరును ప్రత్యేకంగా ప్రస్తావించి అసంతృప్తి వ్యక్తం చేయటంతో పాటు.. హెచ్చరిక లాంటిది జారీ చేసినట్లుగా చెబుతున్నారు. తన చైనా పర్యటన సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసినప్పటికీ.. ఆ ఆనందాన్ని తెలంగాణ మంత్రులు తమ తీరుతో లేకుండా చేశారన్న మాట కేసీఆర్ నోటి వెంట వచ్చిందని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజా వైఖరి.. మంత్రుల పని తీరు విషయంలో కఠినంగా ఉండటమే కాదు.. అవసరమైతే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటానికి కూడా సిద్ధమేనన్న సంకేతాల్ని తాజా మంత్రివర్గ సమావేశంలో ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన ఆరు గంటల సమావేశం పలువురు మంత్రులకు మంట పుట్టించిందన్న భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News