వైఎస్ ను ఆ మాట అని కేసీఆర్ భారీ త‌ప్పు చేశారా?

Update: 2018-10-06 08:04 GMT
ప్ర‌తి దానికి ప‌రిమితులు ఉంటాయి. కొన్నిసార్లు అలాంటివేమీ ప‌ట్టించుకోకుండా వెళితే మొద‌టికే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఎన్నిక‌ల వేళ‌.. తెలంగాణ‌లో ప‌రిస్థితులు తాను అనుకున్న‌ట్లుగా లేవ‌న్న విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగా గుర్తించ‌టం.. చంద్ర‌బాబు.. కాంగ్రెస్ పొత్తు ప్లాన్ ను అంచ‌నా వేయ‌టంలో జ‌రిగిన పొర‌పాటును దిద్దుకునే ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేశారు కేసీఆర్‌.

త‌న అమ్ముల పొదిలో ఉండే విద్వేష అస్త్రాన్ని సంధించ‌టం షురూ చేశారు. విద్వేషపు విషాన్ని క‌క్కుతూ.. ప్ర‌జ‌ల్ని భావోద్వేగానికి గురి చేసి త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల ప‌బ్బాన్ని గ‌డుపుకునే కేసీఆర్.. మ‌రోసారి అదే పంథాలో ప‌య‌నించ‌టం షురూ చేశారు. దీని ఫ‌లిత‌మే గ‌డిచిన మూడు రోజులుగా నిర్వ‌హిస్తున్న వ‌రుస స‌భ‌ల్లో ప‌లువురు నేత‌ల‌పై విషం చిమ్మ‌టం.

తాజాగా వ‌న‌ప‌ర్తిలో జ‌రిగిన స‌భ‌లో దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ఉద్దేశించి దారుణ వ్యాఖ్య‌లు చేయ‌టంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్‌.. వైఎస్ లాంటి వారిని ఏ ఒక్క ప్రాంతానికో ప‌రిమితం చేయ‌టం అస్స‌లు కుద‌ర‌దు. ఆ మ‌హానేత ఊహించ‌ని రీతిలో నిష్క్ర‌మించిన దుఃఖాన్ని త‌ట్టుకోలేక తెలంగాణ ప్రాంతంలో ఎంత‌మంది ప్రాణాల్ని తీసుకున్నారో మ‌ర్చిపోకూడ‌దు.

అలాంటి మ‌హానేత‌పై దారుణ వ్యాఖ్య‌లు చేయటం.. తెలంగాణ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసిన‌ట్లుగా మాట్లాడ‌టంలో అర్థం లేనిది. నిజానికి 2004లో టీఆర్ ఎస్ తో పొత్తు విష‌యంలో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వానికి ఓకే చేయించిన వారిలో వైఎస్ కీల‌క‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ రోజున తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత‌.. కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక ఆయ‌న కేబినెట్‌లో తెలంగాణ‌కు చెందిన ఒక్క మ‌హిళ కూడా లేరు.

కానీ.. వైఎస్ కేబినెట్ లో స‌బితా ఇంద్రారెడ్డి.. గీతారెడ్డి.. డీకే అరుణ‌.. సునీతా ల‌క్ష్మారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ప‌లువురు క‌నిపిస్తారు. వీరంతా తెలంగాణ మ‌హిళ‌లే. సొంత రాష్ట్రంలో ఏ ఒక్క మ‌హిళ‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. స‌మైక్య రాష్ట్రంలో.. అందునా వైఎస్ హ‌యాంలో తెలంగాణ మ‌హిళ‌ల‌కు ద‌క్కిన‌న్ని  మంత్రి ప‌ద‌వుల గురించి మ‌ర్చిపోలేం. అంతేనా.. చేవెళ్ల చెల్లెమ్మ‌గా సుప‌రిచిత‌మైన వైఎస్ దేవుడిచ్చిన చెల్లికి ఇచ్చిన ప్రాధాన్య‌త‌.. ఆమె కోరినంత‌నే చేప‌ట్టిన ప్రాజెక్టులు.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి మ‌ర్చిపోలేం.

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ తానుచాలా చేసిన‌ట్లు చెప్పినా.. కొన్ని జిల్లాల‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త అన్ని జిల్లాల‌కు ఇవ్వ‌లేద‌న్నది మ‌ర్చిపోకూడ‌దు. కానీ.. వైఎస్ అలా కాదు. ఆయ‌న అమ‌ల్లోకి తెచ్చిన ఏ ప‌థ‌క‌మైనా ఉమ్మ‌డి రాష్ట్రంలో మొత్తం.. అంద‌రి ప్ర‌జ‌ల‌కు అందేలా చూశార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. పోతిరెడ్డిపాడు విష‌యంలో విషం చిమ్ముతున్న కేసీఆర్‌.. నిజానికి ఈ రోజున హైద‌రాబాద్ విలువ ఇంత పెర‌గ‌టానికి.. రియ‌ల్ ఎస్టేట్ ఇంత‌గా విస్త‌రించ‌టానికి వైఎస్సే  కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పెద్ద ఎత్తున కంపెనీలను హైద‌రాబాద్‌కు ర‌ప్పించటంలో ఆయ‌న చేసిన కృషిని త‌క్కువ చేసి చూప‌లేం.

అలాంటి ఆయ‌న‌పై అత్యంత నీచ‌మైన భాష‌తో వ్యాఖ్య‌లు చేయ‌టం.. విరుచుకుప‌డ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ప్రాంతాల‌కు అతీమైన అభిమానం ఉన్న నేత‌ల విష‌యంలో కేసీఆర్ చిమ్ముతున్న విషం.. ఆయ‌నకే ముప్పు అన్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఎన్నిక‌ల వేళ వీలైనంత మందిని క‌లుపుకుపోవాల్సిన వేళ‌.. అందుకు భిన్నంగా ఒక్కొక్క‌రిని త‌న మాట‌ల‌తో విషం చిమ్ముతున్న కేసీఆర్ కు.. వైఎస్ లాంటి ప్ర‌జాభిమానం మెండుగా ఉన్న నేత‌పై నోరు పారేసుకోవ‌టం ఆయ‌న‌కే న‌ష్ట‌మ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.
Tags:    

Similar News