కేటీఆర్ క‌న్నా హ‌రీష్ కే కేసీఆర్ ప్రాధాన్యం!

Update: 2018-03-16 14:30 GMT
గురువారం నాడు తెలంగాణ అసెంబ్లీలో 2018 సంవ‌త్స‌రానికి గానూ భారీ బ‌డ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి ఈట‌ల రాజేందర్ ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా ఐదో ఏడాది కూడా కేసీఆర్ స‌ర్కార్....భారీ బడ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టింది. రైతుల సంక్షేమం - ప్రజాభివృద్ధే ధ్యేయంగా 2018-19కు గాను రూ.1.74 ల‌క్ష‌ల‌ కోట్ల బడ్జెట్ ను కేసీఆర్ అండ్ కో రూపొందించింది. గ‌త ఏడాది బ‌డ్జెట్ రూ. 1.49 ల‌క్ష‌ల కోట్లు కావ‌డం విశేషం. మ‌రో ఏడాదిలో జ‌ర‌గ‌బోతోన్న ఎన్నికల నేప‌థ్యంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కేసీఆర్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అయితే, ఈ బ‌డ్జెట్ కేటాయింపుల్లో నీటిపారుద‌ల శాఖకు భారీ స్థాయిలో నిధులు కేటాయించ‌గా - ఐటీ - ప‌రిశ్ర‌మ‌లు - మునిసిప‌ల్ శాఖ‌ల‌కు తక్కువ మొత్తంలో నిధులు ద‌క్కడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

`మిష‌న్ కాక‌తీయ‌`ను తెలంగాణ  స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న సంగ‌తి తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ ప్రాజెక్టు ప‌నుల‌తో పాటు - పెండింగ్ లో ఉన్న మేజ‌ర్ - మ‌ధ్య‌త‌ర‌హా నీటిపారుద‌ల ప్రాజెక్టుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని కేసీఆర్ భావించారు. అందుకే హ‌రీశ్ రావు నేతృత్వంలోని నీటిపారుద‌ల శాఖ‌కు రూ.25,000 కోట్లను కేటాయించారు. అయితే, కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ ఆధ్వ‌ర్యంలోని ఐటీ - ప‌రిశ్ర‌మ‌లు - మునిసిప‌ల్ శాఖ‌ల‌కు క‌లిపి కేవ‌లం రూ.6500 కోట్ల‌ను కేటాయించారు. మునిసిప‌ల్ శాఖ‌కు రూ.5700కోట్లు - ప‌రిశ్ర‌మ‌ల‌కు రూ.1500 కోట్లు - ఐటీ శాఖ‌కు రూ.200 కోట్లను కేటాయించారు. దీనిపై, కేటీఆర్ కొద్దిగా అసంతృప్తిని వెలిబుచ్చిన‌ట్లు తెలుస్తోంది. గ‌త ఏడాది కూడా కేటీఆర్ క‌న్నా హ‌రీష్ కు ఎక్కువ నిధులు కేటాయించ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి, త‌న‌కన్నా హ‌రీష్ శాఖ‌కు ఎక్కువ నిధులు కేటాయించ‌డంపై కేటీఆర్ గుర్రుగా ఉన్న‌ట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News