ప్రభుత్వ ఉద్యోగుల మనసుల్ని దోచేలా సారు ప్లాన్ సిద్ధం?

Update: 2019-08-15 05:08 GMT
కారణం ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంత హ్యాపీగా లేరన్న విషయం తెలిసిందే. కీలకమైన రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయటమే కాదు.. అసలు ఆ శాఖ ఉనికే లేకుండా చేయాలన్న ఆలోచనను సీఎం కేసీఆర్ చేయటం సంచలనంగా మారటమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.

ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న వివిధ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి అంతకంతకూ పెంచుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేసీఆర్.. దానికి చెక్ చెప్పటమే కాదు.. ప్రభుత్వం పట్ల సానుకూల పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచనున్నట్లుగా ప్రకటించారు.

ఎన్నికలు జరిగి దాదాపు తొమ్మిది నెలలు కావొస్తున్నా.. పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించిన నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు. సార్వత్రిక ఎన్నికలు.. తర్వాత జరిగిన ఎన్నికలు.. ఎన్నికల కోడ్ కారణం ఏమైనా.. తాను మాట ఇచ్చిన దిశగా నిర్ణయం తీసుకున్నది లేదు. ఇలాంటివేళ.. ప్రభుత్వ ఉద్యోగుల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు చెక్ పెట్టేలా ముఖ్యమంత్రి తాజాగా పక్కా ప్లాన్ ఒకటి సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

రిటైర్మెంట్ పెంపు నిర్ణయంపై న్యాయపరమైన వివాదాలు.. తలనొప్పులు చోటు చేసుకోకుండా ఉండేలా చర్యలు తీసుకోవటంతో పాటు.. అందుకు తగ్గట్లు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మాటలతో అధికారులు రిటర్మైంట్ పెంపునకు సంబంధించిన అంశాలపై కసరత్తు చేసి.. మూడు రకాల ప్రతిపాదనల్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

మొదటి ప్రతిపాదన విషయానికి వస్తే.. 33 ఏళ్ల సర్వీసు కాలాన్ని పూర్తి చేసిన ఉద్యోగుల్ని ఒక కేటగిరిలో.. రెండో ప్రతిపాదనలో అంతకంటే తక్కువ సర్వీసు ఉన్న వారిని మరో కేటగిరిలో ఉంచి పదవీ విరమణ వయసు పెంపును అమలు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక.. మూడో ప్రతిపాదన విషయానికి వస్తే.. నేరుగా 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు సర్వీసును పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ అక్టోబరు 1 నుంచి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేలా ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే.. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇప్పటివరకూ ఉన్న అసంతృప్తి తగ్గి.. హోల్ సేల్ గా సీఎం కేసీఆర్ కు ఫిదా కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి.. సారేం చేస్తారో చూడాలి.


Tags:    

Similar News