టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం

Update: 2022-10-29 09:30 GMT
మునుగోడు ఉప ఎన్నికల వేళ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన ఈ డీల్ లో కీలక వ్యక్తిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ తాండూర్ ఎమ్మెల్యే భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోహిత్ రెడ్డి ప్రస్తుతం కేసీఆర్ నివాసం ప్రగతిభవన్ లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు 4+4 గన్ మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం రోహిత్ రెడ్డికి 2+2 భద్రత ఉండగా.. ఆ సంఖ్యను 4+4కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయనకు బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్ ను కూడా కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేటినుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈ స్టింగ్ ఆపరేషన్ లో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అదనపు భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయన ఇంటి వద్ద కూడా పికెట్ ను ఏర్పాటు చేశారు. ఎస్కార్క్ వాహనాన్ని సమకూర్చారు.

తనను కొందరు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముందస్తుగానే పోలీసులు రంగంలోకి దిగి స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. రోహిత్ రెడ్డి ఫాంహౌస్ లో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను అమర్చి సంభాషణల్ని రికార్డు చేశారు. సుమారు 3 గంటల పాటు సాగిన ఈ సమావేశాన్ని చిత్రీకరించారు. పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈ ఆపరేషన్ సాగిన తీరును సవివరంగా పేర్కొన్నారు.

శుక్రవారం విడుదలైన రెండు ఆడియో కాల్స్ లీకై బీజేపీ పెద్దల పేర్లు ఉండడం కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు ఎవరి నుంచి ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రతను పెంచినట్టు చెబుతున్నారు.

శుక్రవారం విడుదలైన ఆడియో కాల్స్ లో ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేర్లు బయటపడడంతో దేశవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. పైలెట్ రోహిత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉండడం.. ఆడియో కాల్స్ బయటపడడంతోనే ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచినట్టుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News