రూ.3 లక్షలతో కేసీఆర్ కొత్త ఆట..

Update: 2021-11-21 06:30 GMT

గురి చూసి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి. అలాంటి గురి తప్పని రీతిలో రియాక్టు కావటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న నేర్పు అంతా ఇంతా కాదు.

తాజాగా అలాంటి ఆటను ఎన్నోసార్లు ఆడిన ఆయన.. ఈ మధ్యన కాస్త జోరు తగ్గించారు. తాజాగా మూడు వ్యవసాయ చట్టాల్నిరద్దు చేస్తూ కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన ఒళ్లు విరుచుకున్నారు. జాతీయ స్థాయిలో ఇమేజ్ కోసం తహతహలాడుతున్న ఆయన.. అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు వీలుగా ఆయనో సంచలన ప్రకటన చేశారు.

మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసే ప్రకటనను చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. జాతి జనులకు క్షమాపణలు చెప్పారు. ఎవరేం అనుకున్నా.. తాను అనుకున్నది మాత్రమే చేసే అలవాటు ఉన్న ఆయన్ను మొండిఘటంగా అభివర్ణించేవారెందరో. అలాంటి పెద్ద మనిషి ఒక అడుగు కాదు.. ఏకంగా వంద అడుగులు వెనక్కి వేసేలా వ్యవహరించిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. ఇలాంటి వేళ.. దేశంలోని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భిన్నంగా తెలంగాణ సీఎం రియాక్టు అయ్యారు.

అందివచ్చిన అవకాశాన్ని అందుకోవటంలో కేసీఆర్ చూపించే వేగం ఎంతన్న విషయం తాజాగా ప్రకటనను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇటీవల కాలంలో కేంద్రంలోని మోడీ సర్కారుపై ఆగ్రహంగా ఉండటంతో పాటు.. జాతీయ స్థాయిలో తన గళాన్ని వినిపించాలన్న తహతహ ఎక్కువైన వేళ.. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వ్యవసాయ చట్టాల రద్దు కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొని మరణించిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

అంతేకాదు.. సాయాన్ని ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లుగా చెప్పారు. ఈ సాయం కోసం దాదాపు రూ.25 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లుగా కేసీఆర్ వెల్లడించారు. తాను సాయం చేస్తూనే.. కేంద్రం ముందు కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. కేంద్రం సైతం ఉద్యమంలో పాల్గొని మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకున్నట్లుగా కేంద్రం ప్రకటించినా.. ఐదురాష్ట్రాల ఎన్నికల స్టంట్ అనుకుంటున్నారే తప్పించి దేశంలో మరెవరూ నమ్మటం లేదన్నారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు తాను ఇవ్వాలనుకున్న సాయంతో జాతీయ స్థాయిలో తన పేరు మారుమోగేలా చేయటంతో పాటు.. తన వాణిని అందరూ వినేందుకు అవసరమైన వేదికను తాజా సాయంతో షురూ చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.

ఇప్పటివరకు వినిపిస్తున్న అంచనాల ప్రకారం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళం విప్పిన రైతుపోరాటంలో ఇప్పటివరకు 700 మంది వరకు రైతులు మరణించినట్లుగా లెక్కలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాల్ని రైతు ఉద్యమంలో పాల్గొన్న వారి నుంచి తెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు.. తాను ప్రకటించిన రూ.3లక్షల సాయాన్ని తానే స్వయంగా వెళ్లి బాధిత కుటుంబాలకు అందిస్తానని చెప్పటం ద్వారా.. కొత్త ఆటకు కేసీఆర్ తెర తీశారని చెప్పాలి.

జాతీయ స్థాయిలో తన గళాన్ని వినిపించేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్.. మోడీ చేసిన ప్రకటనను తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో చాలా వేగంగా రియాక్టు అయ్యారని చెప్పక తప్పదు. కేసీఆర్ తాజా ప్రకటన చూస్తే.. వ్యవసాయ చట్టాల రద్దుతో సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయాలన్న ఆలోచనను కేసీఆర్ తాజా ప్రకటన చూస్తే.. ఆయన హైజాక్ చేస్తున్న వైనం ఇట్టే అర్థమవుతుంది.

మొత్తంగా జాతీయ స్థాయిలో ఇమేజ్ బిల్డింగ్ కోసం అందివచ్చిన అవకాశాన్ని ఎంచక్కా అందిపుచ్చుకున్న గులాబీ బాస్.. తన ఆలోచనను అమలు విషయంలో మరెంత నేర్పును ప్రదర్శిస్తారన్నది కాలమే సరైన సమాదానం చెబుతుంది.


Tags:    

Similar News