కోదండానికి కేసీఆర్ భయపడ్డారా?

Update: 2016-06-13 11:30 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ - టీఆరెస్ పార్టీ వర్గాలతో జేఏసీ ఛైర్మన్ కోదండరాంకు ఏర్పడిన వివాదం ముదరడం.. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలతో మాటలు విసురుకోవడంతో టీఆరెస్ లో ఒకింత అలజడి వాతావరణం ఏర్పడింది. కోదండరాం ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో టీఆరెస్ మంత్రులు - నేతలు అంతా ఆయన్ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే... తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంతో కేసీఆర్ తో కలిసి సాగిన కోదండరాం విషయంలో అలా వ్యవహరించడం పట్ల ఇతర పార్టీలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో టీఆరెస్ ఎదురుదాడిని ఆపింది. అయితే... ఈ విషయంపై పార్టీ ముఖ్యులతో పాటు పరిస్థితులను సమీక్షించిన కేసీఆర్ దీనిపై స్థిర నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కోదండరాంపై విమర్శలు చేసినా, ఆయన్ను టార్గెట్ చేసి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని అంచనా వేసిన ఆయన తన మంత్రులు - పార్టీ నేతలను కట్టడి చేసేలా ఆదేశాలు జారీ చేశారు.

కోదండరాంతో పాటు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలను కూడా విమర్శించొద్దని  కేసీఆర్ తన క్యాబినెట్ మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎంపీలను ఆదేశించారు. కోదండాన్ని - జేఏసీని విమర్శిస్తే మొదటికే మోసం వస్తుందని.. ఇరకాటంలో పడాల్సి వస్తుందని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితిని విపక్షాలు అనుకూలంగా తీసుకుంటాయన్న ఉద్దేశంతోనే కేసీఆర్ - జేఏసీ నేతలను విమర్శించవద్దని సూచించినట్టు తెలుస్తోంది.  జేఏసీలో మిగిలిన నేతలంతా కోదండరామ్ వెనకే నడుస్తామని చెప్పడం, ఆయన్ను విమర్శిస్తే - ప్రభుత్వం పట్ల ప్రజల్లో అపనమ్మకం రావచ్చన్న అంచనాలు కూడా ఆయన తాజా ఆదేశాలకు కారణమని తెలుస్తోంది.

మరోవైపు ప్రభుత్వంపై విమర్శలతో వివాదానికి తెరతీసిన కోదండరాం కేసీఆర్ కంటే ముందే తన వైఖరిని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రులు తనను ఎన్ని మాటలన్నా కూడా తాను ఎవరిపైనా ప్రతి విమర్శలు చేయబోనని ప్రకటించారు. ప్రజా సమస్యలపై పోరాటం మాత్రం చేస్తానని చెప్పారు. ప్రజల మెరుగైన జీవితం కోసం తాను రాజీపడబోనని కూడా చెప్పారు. ఆయన మాటలకు ప్రజా సంఘాల నుంచి విపక్ష నేతల నుంచి మద్దతు దొరికింది. ఈ అన్ని కారణాల వల్ల కేసీఆర్ కూడా ఈ విషయంలో తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కోదండం విషయంలో ఆయన భయపడ్డారా లేదంటే తుపాను ముందు ప్రశాంతతలా ఏదైనా కొత్త ఎత్తుగడకు ప్రణాళిక వేస్తున్నారా అన్నది తెలియాలి.
Tags:    

Similar News