జిల్లాల్లోకి కేసీఆర్‌.. టార్గెట్ అదే!

Update: 2022-02-06 12:30 GMT
ప్ర‌గ‌తి భ‌వ‌న్ దాటి బ‌య‌ట‌కు రాడ‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న కేసీఆర్.. మ‌రోసారి జిల్లాల ప‌ర్య‌ట‌న‌లకు సిద్ధ‌మ‌వుతున్నారు. తెలంగాణలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ నెల 11 నుంచి ఆయ‌న వివిధ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఓ వైపు వ‌చ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌లు.. మ‌రోవైపు బీజేపీని టార్గెట్ చేయ‌డం.. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కోస‌మే వాళ్ల ద‌గ్గ‌ర‌కి వెళ్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ నెల 11 నుంచి జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీకారం చుట్ట‌నున్న టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ మొద‌ట జ‌న‌గామ జిల్లాకు వెళ్ల‌నున్నారు. ఆ త‌ర్వాత నిజామాబాద్‌, హ‌నుమ‌కొండ‌, జ‌గిత్యాల‌, యాదాద్రి భువ‌న‌గిరి, వికారాబాద్ త‌దిత‌ర జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. గ‌త కొంత కాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను ఈ సారి ఎలాగైనా పూర్తి చేయాల‌ని కేసీఆర్ ప‌ట్టుద‌లతో ఉన్న‌ట్లు తెలిసింది.

గ‌తంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు ముందు కేసీఆర్ జిల్లాల్లో ప‌ర్య‌టించారు. కొత్త‌గా నిర్మించిన క‌లెక్ట‌రేట్ల ప్రారంభోత్స‌వాల‌తో పాటు వివిధ అభివృద్ధి ప‌నుల్లో పాల్గొన్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని, ఆ ఘ‌న‌త త‌మ‌కే ద‌క్కుతుంద‌ని బీజేపీ నేత‌లు విమ‌ర్శించారు.

ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత కూడా కేసీఆర్ మ‌రోసారి జిల్లాల్లోకి వెళ్లాల‌నుకున్నారు. కానీ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్‌.. ఆ త‌ర్వాత ఒమిక్రాన్ విజృంభ‌ణ‌తో సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడికి ప‌రిస్థితులు సానుకూలంగా ఉండ‌డంతో టూర్ల‌కు రెడీ అయ్యారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా ఆయ‌న జిల్లా క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాల‌ను, టీఆర్ఎస్ జిల్లా కార్యాల‌యాల‌ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వ‌రంగల్‌, హైద‌రాబాద్ మిన‌హా అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ కార్య‌క్ర‌మాలు ప్రారంభానికి సిద్ధ‌మ‌య్యాయి.

మ‌రోవైపు ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో పార్టీపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఇటీవ‌ల 33 జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షుల‌ను నియ‌మించారు. ఇప్పుడు కొత్త కార్యాల‌యాల‌ను ప్రారంభించి వాటిలోనే అధ్య‌క్షుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌నున్నారు. అలాగే ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డం కోసం భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను కూడా నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌భ‌ల్లో బీజేపీని మ‌రింత టార్గెట్ చేసి ప్ర‌జ‌ల‌ను త‌న వైపు తిప్పుకోవ‌డమే కేసీఆర్ టార్గెట్‌గా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.



    

Tags:    

Similar News