ధీమా పోయి.. కేసీఆర్‌ లో భ‌యం మొద‌లైందా?

Update: 2018-09-11 05:25 GMT
దీపం ఉండ‌గానే ఇంటిని చ‌క్క‌దిద్దుకోవ‌టం మామూలే. కానీ.. దీపం ఆరిపోయిన త‌ర్వాత ఇంటిని చ‌క్కదిద్దుకోవాల‌న్న ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడితే.. తెలివిత‌క్కువత‌న‌మైనా అయి ఉండాలి.. లేదంటే.. స‌రైన ప్లానింగ్ లేకుండా ఉండి ఉండాలి. వ్యూహ ర‌చ‌న‌లో దిట్ట‌గా పేరున్న తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిస్థితి ఇప్పుడు ఇలానే ఉందా?  అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది.

ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం భారీ క‌స‌ర‌త్తు చేసి.. ప‌క్కా ప్లాన్ చేసి.. తాను అనుకున్న వేళ‌కు.. అనుకున్న‌ట్లుగా జ‌ర‌గ‌టానికి వీలుగా పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేసిన కేసీఆర్‌.. తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న వింటే ఇదేమిటి? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.

రానున్న ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని సాధించేందుకు వీలుగా తెలంగాణ‌లో కొత్త ఓట‌ర్ల‌ను పెద్ద ఎత్తున మోదు చేయించాల‌ని ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజా మాజీ మంత్రుల‌కు.. ఎమ్మెల్యేల‌కు టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌కు  కీల‌క సూచ‌న చేశారు. ప్ర‌స్తుతం ఫామ్ హౌస్ లో ఉన్న ఆయ‌న‌.. సోమవారం ప‌లువురు నేత‌ల‌తో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్‌.. కొత్త ఓట‌ర్ల న‌మోదుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయాల‌ని ఆయ‌న చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

కొత్త ఓట‌ర్ల న‌మోదుకు ఈ నెల 25 వ‌ర‌కు గ‌డువు ఉంద‌ని.. కొత్త ఓట‌ర్ల‌ను పెద్ద ఎత్తున చేర్చాల‌న్న మాట చెప్పిన‌ట్లుగా స‌మాచారం. ఇదే నిజ‌మైతే.. తాము అధికారంలో ఉన్న‌ప్పుడే ఈ డ్రైవ్ చేసి ఉంటే బాగుండేద‌న్న మాట ప‌లువురి నేత‌ల నోట వినిపిస్తోంది. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ప్ర‌చారంతో పాటు.. అసంతృప్తుల‌ను బుజ్జ‌గించే విష‌యంలో త‌ల‌మున‌క‌లైన అభ్య‌ర్థుల‌కు తాజాగా కేసీఆర్ నుంచి వ‌స్తున్న ఆదేశం కొత్త త‌ల‌నొప్పిగా మారిన‌ట్లుగా తెలుస్తోంది.

అన్ని ప‌క్కాగా ప్లాన్ చేసుకున్న కేసీఆర్‌.. ఓట‌ర్ల‌ను పెద్ద ఎత్తున చేర్పించాల‌న్న ప్లాన్ విష‌యంలో ఎందుకు క‌స‌ర‌త్తు చేయ‌న‌ట్లు. అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌న్న ధీమాతో కొత్త ఓట‌ర్ల‌ను చేర్పించే ప్ర‌య‌త్నం చేయ‌ని ఆయ‌న‌కు.. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు.. మ‌హాకూట‌మి దిశ‌గా జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాలతో పాటు.. సిట్టింగుల‌పై పెల్లుబుకుతున్న అసంతృప్తితో అలెర్ట్ అయి తాజా సూచ‌న చేశారా? అన్న‌ది ఇప్పుడు క్వ‌శ్చ‌న్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News