స్మార్ట్ సిటీలకు ఇవేం నిధులు?

Update: 2015-12-18 17:30 GMT
తప్పు పట్టీ పట్టనట్లుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ సిటీ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పుబట్టారు. హైదరాబాద్ నుంచి స్మార్ట్ సిటీల పథకం నుంచి తప్పించాలని కోరుతూనే, కేంద్రం అమలు చేసే ఈ పథకంతో ఓ మోస్తరు సిటీలకు ఏమీ ఒరిగేది ఉండదని, అసలు సిటీలు కానివాటిలో మౌలికః సదుపాయాలు కల్పించడానికే ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుకు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. అందులో హైదరాబాద్ ను స్మార్ట్ సిటీ పథకం నుంచి తప్పించి కరీంనగర్ ను చేర్చాలని కోరారు. అలా కోరుతూనే ఆయన కొన్ని కీలక ప్రశ్నలను సంధించారు. స్మార్ట్ సిటీల పథకానికి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి కేవలం వంద కోట్ల రూపాయలు ఇస్తుందని, స్మార్ట్ సిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇవి ఏమాత్రం సరిపోవని స్పష్టం చేశారు. ఉదాహరణకు, హైదరాబాద్ నే తీసుకుంటే ఇక్కడ ఒక్క డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికే కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం. ఇక వరంగల్ - కరీంనగర్ - తిరుపతి - విజయవాడ వంటి నగరాలకూ ఇదే పరిస్థితి. వంద కోట్ల రూపాయలను ఏడాదికి ఇస్తే ఆయా నగరాల్లో మంచినీటి సదుపాయం కల్పించడానికి సరిపోవు. మురుగునీటి పారుదలకు సరిపోవు. కమ్యూనికేషన్లను కల్పించడానికి సరిపోవు. ఐదేళ్లలో ఏడాదికి వంద కోట్ల చొప్పున రూ.500 కోట్లు ఇస్తారని అనుకున్నా అవన్నీ కూడా ఏదో ఒక పథకానికి తప్ప నగరాన్ని స్మార్ట్ గా తీర్చిదిద్దడానికి ఏమాత్రం సరిపోవు.

హైదరాబాద్ ను స్మార్ట్ సిటీ పథకం నుంచి తప్పించి ముంబై తరహాలో దానికి ప్రత్యేకంగా నిధులు కావాలని కేసీఆర్ కోరినా.. ఆయన లేఖలో స్మార్ట్ సిటీ పథకానికి సంబంధించి మౌలికమైన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేసీఆర్ లేఖను సీరియస్ గా తీసుకుని స్మార్ట్ సిటీ పథకాన్నే పునర్ నిర్వచించాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News