బీజేపీతో కేసీఆర్.. ఢిల్లీలో దోస్తీ.. గ‌ల్లీలో కుస్తీ...!

Update: 2021-09-19 00:30 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలాంటి అప‌ర రాజ‌కీయ చాణుక్యుడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించి హ్యాట్రిక్ కొట్టాల‌ని క‌సితో ఉన్నారు. తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండుసార్లు అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌పై ఇప్పుడు వ్య‌తిరేక‌త ఉంది. మ‌రోవైపు తెలంగాణ‌లో పూర్తిగా క‌ళ కోల్పోయిన కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు అయ్యాక స‌రికొత్త ఉత్సాహం వ‌చ్చింది. ఇక బీజేపీ కూడా కాచుకుని ఉంది. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో నాలుగు ఎంపీ సీట్ల‌తో పాటు దుబ్బాక గెలుపు, గ్రేట‌ర్లో ఊహించ‌ని విధంగా సీట్లు గెలుచుకోవ‌డం లాంటి ప‌రిణామాలు ఇక్క‌డ క‌మ‌ళ‌ద‌ళానికి కూడా బ‌లాన్ని పెంచాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు కేసీఆర్‌కు బీజేపీ ఎక్క‌డిక‌క్క‌డ న‌ట్లు బిగిస్తూ వ‌స్తోంది. బీజేపీ నుంచి వ‌చ్చే ప్ర‌మాదాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియ‌క కేసీఆర్ త‌న‌దైన స్టైల్లో రాజ‌కీయం చేస్తున్నారు. మ‌రోవైపు కేంద్రంలో స్ట్రాంగ్‌గా ఉన్న బీజేపీ విష‌యంలో మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో పాటు కేంద్రంలో బీజేపీకి తాము స్నేహితుల‌మే అన్న సంకేతాలు పంపుతున్నారు. మ‌రోవైపు రాష్ట్రంలో మాత్రం క‌య్యానికి కాలు దువ్వుతున్నారు. రాష్ట్రంలో ఏ మాత్రం చూసి చూడ‌న‌ట్టు ఉన్నా బీజేపీ కేసీఆర్‌ను అద‌ను చూసి దెబ్బ‌కొట్టేందుకు రెడీగా ఉంది. ఆ ఛాన్స్ కేసీఆర్ ఇవ్వ‌ద‌ల‌చుకోలేదు.

కేసీఆర్ త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల్లో ప‌దే ప‌దే మోడీ, అమిత్ షాల‌ను క‌లవ‌డ‌మో లేదా వారిని కీర్తించ‌డ‌మో జ‌రుగుతూ వ‌స్తోంది. అయితే తాజాగా శుక్ర‌వారం మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని టీఆర్ఎస్ తీవ్రంగా వ్య‌తిరేకించ‌డం మాత్రం అంద‌రికి షాక్ ఇచ్చిన‌ట్ల‌య్యింది. వ‌ర్షాకాల స‌మావేశాల చివ‌రి రోజు ప్ర‌తిప‌క్ష ఎంపీల ప్ర‌వ‌ర్త‌న‌, ఆరోప‌ణ‌లు ప‌రిశీలించ‌డానికి చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు రాజ్య‌స‌భ‌లో ఓ క‌మిటీ ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీ నుంచి టీఆర్ఎస్ వైదొల‌గి అంద‌రికి షాక్ ఇచ్చింది.

ఇప్ప‌టికే ఈ క‌మిటీ నుంచి కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, ఆర్జేడీ కూడా వైదొల‌గాయి. ఈ విష‌యంలో టీఆర్ఎస్ బీజేపీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ బాట‌లో న‌డ‌వ‌డం జాతీయ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆగ‌స్టు 11వ తేదీని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్ద‌రు మ‌హిళా ఎంపీలు బీమా స‌వ‌ర‌ణ బిల్లు ఆమోదం జ‌రిగిన‌ప్పుడు మార్ష‌ల్స్‌తో గొడ‌వ ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో మార్ష‌ల్స్‌కు గాయాలు అయ్యాయి. ఆ త‌ర్వాత మంత్రులు త‌మ సీట్ల‌లోకి వెళ్ల‌కుండా అడ్డుకోవ‌డంతో పాటు ఎల్ఈడీ టీవీ స్టాండ్‌పై ఎక్కారు. స‌భ‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌పై వెంక‌య్య నాయుడు ఓ క‌మిటీని వేశారు.

ఈ క‌మిటీలో చేరేందుకు ముందు అంగీక‌రించిన టీఆర్ఎస్ త‌ర్వాత త‌ప్పుకుంది. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తోన్న వారు కేసీఆర్ జాతీయ స్థాయిలో సైతం
బీజేపీ గ్రాఫ్ త‌గ్గుతూ ఉండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌నే భావించి బీజేపీకి ఢిల్లీలోనూ దూరం దూరం జ‌రుగుతున్నార‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.




Tags:    

Similar News