కేసీఆర్‌ పెనుకొండ ఎమ్మెల్యేతో ప్ర‌త్యేకంగా భేటీ!

Update: 2017-10-02 05:42 GMT
ప‌రిటాల శ్రీరామ్ పెళ్లిలో ఆస‌క్తిక‌ర అంశాల‌కు లోటు లేద‌ని చెప్పాలి. ఈ పెళ్లికి తెలంగాణ‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌రు కావ‌టం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు కానీ.. విభ‌జ‌న త‌ర్వాత కానీ ఒక పెళ్లి వేడుక‌కు హాజ‌రు కావ‌టం కోసం ఏపీకి కేసీఆర్ రావ‌టం ఇదే తొలిసారిగా చెప్పాలి. పెళ్లికి హాజ‌రైన కేసీఆర్ ను చూసేందుకు పెళ్లి వేడుక‌కు వ‌చ్చిన వారంతా ప్ర‌త్యేక ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించారు.

ఇదిలా ఉంటే.. ప‌రిటాల ఇంట పెళ్లికి వ‌చ్చిన కేసీఆర్‌.. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థ‌సార‌ధి గురించి వాక‌బు చేశారు.ఆయ‌న్ను ప్ర‌త్యేకంగా పిలిపించుకొని మాట్లాడారు. అంత‌మంది నేత‌లు ఉండ‌గా బీకే పార్థ‌సార‌ధి గురించి కేసీఆర్‌కు అంత ఆస‌క్తి ఎందుకంటే.. అందుకో కార‌ణం లేక‌పోలేదు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో అనంత‌పురం జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ గా బీకే పార్థ‌సార‌ధి వ్య‌వ‌హ‌రించారు. ఆ స‌మ‌యంలో ఉమ్మ‌డి ఏపీకి ప్ర‌ణాళికా బోర్డు ఛైర్మ‌న్ గా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించారు. అంతేకాదు.. అనంత‌పురం జిల్లాకు ఇన్ చార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు. ఆ స‌మ‌యంలో బీకేతో కేసీఆర్‌ కు ప‌రిచ‌యం ఉంది. పాత ప‌రిచ‌యాన్ని గుర్తు పెట్టుకొని మ‌రీ బీకేను పిలిపించుకున్న కేసీఆర్‌.. ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

పెళ్లి వేడుక‌కు హాజ‌రైన సంద‌ర్భంగా కేసీఆర్ వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చే స‌మ‌యానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించి కింద‌కు దిగారు. త‌న‌కు ఎదురుప‌డ్డ కేసీఆర్ తో క‌ర‌చాల‌నం చేశారు. ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. వెళుతున్నారా అంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబును కేసీఆర్ అడిగారు. తాను వెంట‌నే వెళ్లాల్సిన ప‌ని ఒక‌టి ఉంద‌ని చెప్పిన చంద్ర‌బాబు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. నూత‌న దంప‌తుల్ని ఆశీర్వ‌దించిన కేసీఆర్ అనంత‌రం ప‌రిటాల ర‌విఘాట్‌ కు వెళ్లి శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించారు.
Tags:    

Similar News