కేసీఆర్ దూకుడు ఇలా ఉంటుంది మ‌రి

Update: 2016-10-24 04:45 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటే తాను త‌లచిన ప‌నిని చేసేందుకు వీలైనంత తాప‌త్ర‌యప‌డే మ‌నిషిగా పేరు. సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాతి స‌మ‌యం నుంచి కొత్త స‌చివాల‌యాన్ని నిర్మించాల‌ని డిసైడ‌యిపోయిన కేసీఆర్ ఆ క్ర‌మంలో వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల మంత్రిమండలిలో తీర్మానించిన విధంగానే వచ్చే నెల మొదటి వారంలో కూల్చివేత పనులు ప్రారంభించనున్నారు. తెలంగాణ సచివాలయంలోని ఎ - బి - సి - డి బ్లాకులను కూల్చివేసి ఆ స్థానంలో బహుళ అంతస్థుల భవన సముదాయాన్ని నిర్మించాలనుకున్న కేసీఆర్‌ ప్రస్తుతం తన ఆలోచనను మరింత విస్తరించినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు బ్లాకులతో పాటు ఆంధ్రప్రదేశ్‌ కు కేటాయించిన సచివాలయ భవనాలు ఉత్తర - దక్షిణ బ్లాకులు - ఆ రాష్ట్ర సీఎం కార్యాలయమైన ఎల్‌ బ్లాకును కూడా స్వాధీనం చేసుకుని మరింత విశాలంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇందుకు అడ్డంకులు ఎదురుకాకుండా ఉండేందుకు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ ద్వారా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు.

తాజాగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ ఎల్‌ నరసింహన్‌ తో స‌మావేశ‌మైన కేసీఆర్...ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన పరిపాలనా యంత్రాంగాన్ని పూర్తిగా అమరావతికి తరలించిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఈ భవనాలను తమకు అప్పగించాలన్న ప్రతిపాదన పెట్టారు. మంత్రిమండలిలో తీర్మానించిన ఈ అంశాన్ని గ‌వ‌ర్న‌ర్‌  ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు చేర‌వేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 10వ షెడ్యూల్‌ లో పేర్కొన్న విధంగా సచివాలయంతో పాటు ఇతర శాఖాధిపతుల కార్యాలయాలు - పభుత్వరంగ సంస్థలు పదేళ్ళ పాటు ఉమ్మడి ఆస్తులుగా గుర్తించారు. అందులో సచివాలయం కూడా ఒకటి. ఆ నిబంధనల మేరకే డి - జె - కె - ఎల్‌ బ్లాకులను ఆంధ్రప్రదేశ్‌ కు కేటాయించారు. కానీ పరిపాలనా సౌలభ్యం కోసం చంద్రబాబు రెండున్నర సంవత్సరాలకే తన రాష్ట్ర భూభాగానికి వెళ్ళిపోయారు. దీంతో ప్రస్తుతం ఆ భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ వాటిని స్వాధీనం చేసుకోవడానికి చేసిన ప్రతిపాదన ఫలించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజాగా  గవర్నర్‌ తో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యంలోగా సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తున్నట్టు ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

 కొత్త సచివాలయాన్ని తరతరాలకు గుర్తుండిపోయే విధంగా - దేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా నిర్మించాలన్న తమ ఆశయ సాధనకు సంపూర్ణ సహకారం అందజేయవలసిందిగా కేసీఆర్‌ నరసింహన్‌ ను కోరారు. ఒకవేళ పదేళ్ళ పాటు ఏపీ ప్రభుత్వానికి ఇక్కడ తమకంటూ ఒక స్థానం ఉండాలన్న ఆలోచన ఉంటే హైదరాబాద్‌ లో ఉన్న మరే ఇతర భవనాలనైనా కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు - మంత్రులు - ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలకు సరిపడే సువిశాలమైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను కూడా కేటాయించేందుకు సిద్ధమని చెప్పారు. ఇప్పుడున్న సచివాలయం రెండు రాష్ట్రాల బ్లాకులు కలుపుకుని 18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమై ఉంది. తెలంగాణ సచివాలయం దాదాపు 10 ఎకరాలు ఉంటుంది. ఎ - బి - సి - డి బ్లాకులను కూల్చివేసి భూగర్భంలో ఆరు అంతస్థుల పార్కింగ్‌ కాంప్లెక్స్‌ - పైన 8 అంతస్థుల పరిపాలనా భవనాలు నిర్మించేందుకు రోడ్లు - భవనాలశాఖ ఇంజనీరింగ్‌ నిపుణులు రోడ్‌ మ్యాప్‌ ను తయారు చేసి ఇటీవలే సీఎంకు అందజేశారు. ‘యు’ ఆకారంలో ఈ సువిశాల బహుళ అంతస్థుల భవనాలు నిర్మించాలని ప్రతిపాదించినప్పటికీ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన తన ఆలోచనలను - ఆవశ్యకతను సీఎం కేసీఆర్‌ సవివరంగా నివేదించారు. పచ్చని చెట్లు - విశాలమైన పచ్చిక బైళ్ళు - రంగురంగుల పూల మొక్కలు - ఇతర అలంకరణలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించ తలపెట్టిన నూతన సచివాలయానికి సంబంధించిన అన్ని విషయాలను ఈ సందరర్భంగా కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ కు వివరించారు. రోడ్లు - భవనాల శాఖ తయారు చేసిన ప్రతిపాదనలను - భవన సమూదాయ నిర్మాణానికి సంబంధించిన నమూనాను - ఆర్థికపరమైన అంశాలతో కూడిన నివేదికలను అందజేశారు. సాధ్యమైనంత త్వరలో చంద్రబాబును ఒప్పించి ఎలాగైనా ఏపీ సచివాలయ భవనాలను తమకు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని అధికార వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా ఈ అంశంపై చర్చించి నిర్ణయాన్ని తెలియపరిచేందుకు కేసీఆర్‌ కు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News