వెంక‌య్య‌కు ఫుల్ భ‌రోసా ఇచ్చిన కేసీఆర్ సాబ్‌

Update: 2017-07-26 10:29 GMT
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుతో తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధం బ‌ల‌ప‌డుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. తాజాగా కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్తున్నారు. గ‌తంలో ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన స‌మ‌యంలో కేంద్ర‌మంత్రిగా ఉన్న వెంక‌య్య‌నాయుడును సీఎం కేసీఆర్ క‌లిసిన సందర్భాలు త‌క్కువే అని చెప్ప‌వ‌చ్చు. అయితే తాజా టూర్‌ లో వెంక‌య్య‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు అర‌గంట పాటు వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది.

ఈ స‌మావేశం అనంత‌రం  ఎన్డీఏ ఉపరాష్ర్టపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనను మర్యాదపూర్వకంగానే కలిశారని తెలిపారు. ప్రస్తుతం పొలిటికల్ అంశాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. ఉపరాష్ర్టపతి ఎన్నికల్లో టీఆర్ ఎస్ తనకు మద్దతిస్తుందని స్పష్టం చేశారు.  అయితే ఈ స‌మావేశం వెనుక రాజ‌కీయ అజెండా ఉండి ఉంటుందని చ‌ర్చ జ‌రుగుతోంది. కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తెలుగు రాష్ర్టాల‌లోని ప‌రిణామాల‌ను అత్యంత సునిశితంగా వెంక‌య్య నాయుడు అధ్య‌యనం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర విభ‌జ‌నకు సంబంధించిన ప‌లు అంశాల‌ను వెంక‌య్య వ‌ద్ద కేసీఆర్ ప్ర‌స్తావించి ఉంటార‌ని అంటున్నారు. హైకోర్టు విభ‌జ‌న, ఇరు రాష్ర్టాల మ‌ధ్య ఉన్న నిధుల పంపిణీ పేచీలు, ఇత‌ర‌త్ర అంశాల గురించి ఈ ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు ముచ్చ‌టించుకొని ఉంటార‌ని భావిస్తున్నారు.

కాగా, రాష్ట్రప‌తి రామ్‌ నాథ్ కోవింద్ ప్ర‌మాణ‌స్వీకారం కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సైతం ఈ కార్య‌క్ర‌మానికి వెళ్లారు. అయితే ఆయ‌న మంగ‌ళ‌వారమే రాష్ర్టానికి తిరిగి వ‌చ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీలో ఉండి ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌ను క‌లుస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని సైతం క‌లిసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.
Tags:    

Similar News