కుమార‌స్వామితో క‌సీఆర్ కొత్త లెక్క‌లు!

Update: 2019-05-09 04:47 GMT
చెల‌రేగిపోవ‌టం ఎంత బాగా వ‌చ్చో.. అంతేలా త‌గ్గిపోవ‌టం ఎలానో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ బాగా తెలుసు. వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉన్న వేళ‌.. త‌న‌కు మించినోడు లేడ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే సారువారు.. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు చ‌ప్పుడు చేయ‌కుండా కామ్ గా ఉండ‌ట‌మే కాదు.. రాజీకి సైతం వెనుకాడ‌రు. నచ్చిన‌ప్పుడు ఆకాశానికి ఎత్తేయ‌టం.. తేడా వ‌స్తే పాతాళానికి తొక్కేయ‌టం లాంటివి కేసీఆర్ కు ఎవ‌రూ ప్ర‌త్యేకంగా నేర్పించాల్సిన అవ‌స‌రం లేదు.

ఈ విష‌యంలో ఆయ‌న ఎప్పుడో పండిపోయారని చెప్పాలి. తాజాగా ఆయ‌న క‌దుపుతున్న పావులు ఆస‌క్తిక‌రంగా మారిన‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు. తెలివైనోడు ఒక అడుగు ముందుగా ఆలోచిస్తార‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే.. క‌సీఆర్ ప్ర‌స్తుతం వేస్తున్న రాజ‌కీయ ఎత్తుల గురించి తెలిస్తే.. ఔరా అనుకోవాల్సిందే.

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఎంత‌కైనా.. ఎవ‌రి మీద‌నైనా విరుచుకుప‌డే త‌త్త్వం మోడీ త‌ర్వాత ఆ స్థాయిలో ఉన్న నేత కేసీఆరేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఓప‌క్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామ‌రూపాల్లేకుండా చేసే క్ర‌తువును ఒక కొలిక్కి తెచ్చిన ఆయ‌న‌.. తాజాగా అదే కాంగ్రెస్ పార్టీతో మంత‌నాల‌కు మ‌రో కొత్త ఎత్తును వేస్తున్న వైనం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కేంద్రంలో మోడీ స‌ర్కారు మ‌ళ్లీ ప‌వ‌ర్లోకి వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌టం.. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స‌త్తా లేక‌పోవ‌టంతో కేసీఆర్ కొత్త ఆలోచ‌న‌ల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. యూపీఏ ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో.. ఆ దిశ‌గా పావులు క‌దుపుతున్నారు. త‌న నిర్ణ‌యాల కార‌ణంగా యూపీఏతో ఎలాంటి స‌త్ సంబంధాలులేని పరిస్థితి.

కేసీఆర్ పేరెత్తితేనే కాంగ్రెస్ కారాలు మిరియాలు నూరుతున్న వేళ‌లో.. వారితో స‌ఖ్య‌త కోసం కొత్త ఎత్తును కేసీఆర్ వేస్తున్నారు. కాంగ్రెస్ అధినాయ‌క‌త్వానికి బాగా ద‌గ్గ‌రైన క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామిని ఆయ‌నిప్పుడు కొత్త రాయ‌బారాల‌కు తెర తీసినట్లుగా స‌మాచారం. కాంగ్రెస్ తో స‌ఖ్య‌త కోసం ఆయ‌న్ను ప్ర‌యోగించిన‌ట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో యూపీఏ స‌ర్కారు కొలువు తీరినా.. 1996 నాటి నేష‌న‌ల్ ఫ్రంట్ ప్ర‌భుత్వ త‌ర‌హాలో ప్రాంతీయ పార్టీల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వ‌చ్చిన ప‌క్షంలో.. కాంగ్రెస్ కీల‌కం కానుంది.

ఈ నేప‌థ్యంలో ఆ పార్టీతో స‌త్ సంబంధాలు చాలా అవ‌స‌రం. ఇందులో భాగంగా అప్పుడెప్పుడో అవ‌స‌రం వ‌చ్చిన నాడు సంబంధాల కోసం ప్ర‌య‌త్నాలు చేసే క‌న్నా.. ముంద‌స్తుగా రిలేష‌న్ బిల్డ్ చేసుకోవ‌టానికి వీలుగా కేసీఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితో మంత‌నాలు సాగిస్తున్న ఆయ‌న‌.. త‌న త‌ర‌ఫు రాయ‌బారాన్ని కాంగ్రెస్ పెద్ద‌ల వ‌ద్ద‌కు తీసుకెళ్లాల్సిందిగా కోరిన‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను బంతాట ఆడుకుంటున్న వేళ‌.. నేరుగా ముఖం చూపించ‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే మంచి సంబంధాలున్న కుమార‌స్వామి లాంటి వారితో అయితే.. బాగుంటుంద‌న్న ఆలోచ‌న చేసిన ఆయ‌న.. అందులో భాగంగా ఇప్ప‌టికే చ‌ర్చ‌ల‌కు తెర తీసిన‌ట్లుగా తెలుస్తోంది. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు ఎలా మారాల‌న్న విష‌యంలో కేసీఆర్ ప్ర‌ద‌ర్శించే తీరును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సిందే.
Tags:    

Similar News