మాష్టారికి కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వరా?

Update: 2016-10-18 05:23 GMT
తెలంగాణ రాష్ట్ర సాధనలో జోడెద్దుల మాదిరిగా వ్యవహరించి.. దశాబ్దాల తరబడి తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చిన కేసీఆర్.. కోదండరాంలు తర్వాతి కాలంలో ఎవరి దారిలో వారు పయనిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ కీలక బాధ్యత చేపట్టగా.. కోదండరాం మాష్టారు మాత్రం తెలంగాణ ఉద్యమవేత్తగా మిగిలిపోయారు. ప్రభుత్వ ఏర్పాటు మొదలు నుంచి కేసీఆర్ సర్కారు తీరుపై ఆచితూచి స్పందిస్తున్న కోదండరాం మాష్టారు ఈ మధ్యన విమర్శనాస్త్రాల తీవ్రతను పెంచారు. కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న విధానాలు కొన్నింటిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన.. తాజాగా తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను కలుసుకొని కొత్త జిల్లాల ఏర్పాటులో చోటు చేసుకున్న తప్పులను తెర మీదకు తీసుకొచ్చారు.

నోటిఫికేషన్లో ఒక మాదిరి..తుది ప్రకటనలో మరో మాదిరిగా చేసిన మార్పులతో చాలా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. జిల్లాల పునర్విభజన ప్రజల అభీష్టం ప్రకారం జరగలేదని ఆయన మండిపడ్డారు. తాము చేస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని నేపథ్యంలో ఆవేదనతో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేయగా.. ఇద్దరు మరణించి.. మరొకరు ఆసుపత్రితో చికిత్స పొందుతున్న విషయాన్ని కోదండరాం వెల్లడించారు.

ప్రభుత్వం వెనువెంటనే మేలుకోకుంటే ఈ ఆత్మహత్యలు మరిన్ని చోటు చేసుకునే అవకాశం ఉందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రజల ప్రమేయం లేకుండా రాత్రికి రాత్రి రాజకీయ నేతల ఒత్తిళ్ల కారణంతో కానీ.. ఇతర కారణాలతో మార్పులు చోటు చేసుకున్నాయని ఆరోపించిన కోదండరాం మాష్టారిని విలేకరులు ఒక సూటి ప్రశ్న వేశారు. జిల్లాల పునర్విభజన విషయంలో లోటుపాట్లను సీఎస్ దృష్టికి తీసుకొచ్చే కన్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేరుగా కలిసి ఆయన దృష్టికి తీసుకురావొచ్చుగా అని అడిగారు. దీనికి రియాక్ట్ అయిన కోదండరాం.. తనదైన శైలిలో సమాధానం ఇవ్వటం గమనార్హం. సీఎం అపాయింట్ మెంట్ దొరికితే నేరుగా సమస్యలు చెప్పుకుంటారని.. పెద్ద సారుకు విన్నవించినందుకు సమస్యలు పరిష్కారమవుతాయన్న సంతృప్తితో వెనుదిరుగుతారన్న కోదండరాం..  సమాధానం ఏం వస్తుందో తెలిసి ఈ ప్రశ్న వేయటం ఎందుకు అంటూ ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ లభించకపోవటాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఎంత కోపతాపాలు ఉంటే మాత్రం.. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కోదండరాం మాష్టారి లాంటి వారికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అపాయింట్ మెంట్ ఎందుకు ఇవ్వన్నట్లు..? మాష్టారిపై ముఖ్యమంత్రికి అంత గుర్రు ఎందుకు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News