కేసీఆర్ ఆఫ‌ర్‌: 6 మొక్క‌లకు 2 పాడి ప‌శువులు

Update: 2017-08-09 05:16 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. చేతికి ఎముక లేన‌ట్లు వ‌రాలు ప్ర‌క‌టించే ఆయ‌న‌.. అప్పుడ‌ప్పుడు సినిమాటిక్ గా రియాక్ట్ అవుతుంటారు. సీజ‌న్ల‌కు తగ్గ‌ట్లు ప్రోగ్రామ్ లు నిర్వ‌హించే ఆయ‌న‌.. కొన్ని సంద‌ర్భాల్లోకొన్ని కార్య‌క్ర‌మాల‌కు పెద్ద‌పీట వేయ‌టం క‌నిపిస్తుంది. ప్ర‌తి ఇంటికి న‌ల్లా అంటూ భారీ కార్య‌క్ర‌మాన్ని మొద‌లెట్టిన మొద‌ట్లో.. తాము కానీ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి ప్ర‌తి ఇంటికి న‌ల్లా నీళ్లు ఇవ్వ‌నిప‌క్షంలో ఓట్లు అడిగేందుకే వెళ్ల‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ విష‌యం మీద కొంత‌కాలం జోరుగా ప్ర‌చారం చేసిన కేసీఆర్‌.. ఆ త‌ర్వాత మాత్రం చ‌ప్పుడు చేయ‌కుండా కామ్ గా ఉండిపోయార‌న్న ఆరోప‌ణ ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కేసీఆర్ దృష్టి మేక‌లు.. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం మీద‌నే ఉంద‌ని చెప్పాలి. తెలంగాణ మొత్తాన్ని ప‌చ్చ‌గా చూడాల‌న్న‌దే త‌న ఆశ‌యంగా చెప్పిన ఆయ‌న‌.. గ‌త ఏడాది వ‌ర్షాకాలంలో ఇదే రీతిలో హ‌డావుడి చేశారు. ఒక‌ద‌శ‌లో నాటిన మొక్క‌ల్ని చూసేందుకు ప్ర‌త్యేక బ‌స్సు వేసుకొని తెలంగాణ మొత్తం తిరుగుతానంటూ హ‌డావుడి చేశారు. ఆ త‌ర్వాత చ‌ప్పుడు చేయ‌కుండా ఉండ‌టం త‌ర్వాతి ముచ్చ‌ట‌.

ఇదిలా ఉంటే.. తాజాగా మేడ్చ‌ల్ జిల్లా శామీర్ పేట్ మండ‌ల ప‌రిశిలోని మూడు చింత‌ల‌ప‌ల్లిలో జ‌రిగిన గ్రామ‌స‌భ‌లో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నో బంఫ‌ర్ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించారు.  హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా ఆరు మొక్క‌ల్ని నాటి.. పెంచుకుంటున్న కుటుంబాల‌కు రెండు పాడి ప‌శువుల్ని బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని చెప్పారు. తాను జ‌న‌వ‌రిలో సీక్రెట్ గా స‌ర్వే చేయిస్తాన‌ని.. అప్పుడు ఎవ‌రింట్లో ఆరు మొక్క‌లు క‌నిపిస్తాయో.. ఆ కుటుంబానికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున రెండు పాడి ప‌శువుల్ని బ‌హుమ‌తిగా అందిస్తామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా కాస్తంత నాట‌కీయంగా మాట్లాడిన కేసీఆర్‌.. మీరు అడిగినా అడ‌గ‌క‌పోయినా నేను మీ కోరిక‌లు తీరుస్తున్నా. నా కోరిక‌ల్లా హ‌రిత‌హారం విజ‌యవంతం చేసి ప‌చ్చ‌ని తెలంగాణగా మార్చ‌టే. నా కోరిక తీరుస్తారా? అని అడిగారు. దీనికి అక్క‌డున్న ప్ర‌జ‌లంతా తీరుస్తామ‌ని చెప్ప‌టంతో.. ప్ర‌తి ఒక్క‌రూ ఆరు మొక్క‌లు నాటాల‌ని చెప్పిన కేసీఆర్‌.. త‌ర్వాత సీక్రెట్ స‌ర్వే.. రెండు పాడి ప‌శువుల్ని ఇవ్వ‌నున్న‌ట్లుగా పేర్కొని  అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర్చారు.
Tags:    

Similar News