వారిద్దరికి మంత్రి పదవులు కేసీఆర్ ఎందుకివ్వరు?

Update: 2019-08-25 05:07 GMT
పండగలు వస్తుంటే అందరికి అదోలాంటి ఉత్సాహం. మరో వారంలో వినాయకచవితి వచ్చేస్తుండటం.. ఆ తర్వాత వరుస పండుగలతో సందడి వాతావరణం నెలకొంటుందన్న విషయం తెలిసిందే. వాస్తవానికి శ్రావణంతోనే పండుగ కళ వచ్చేస్తుంది. అలా మొదలైన పండగలు సంక్రాంతి వరకూ వరుస పెట్టి వస్తాయి. ఈ కారణంతోనే చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా చాలామందికి ఆగస్టు నుంచి జనవరి మధ్య కాలాన్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నెలలు ఎప్పుడు వస్తాయా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

తాజాగా ఈ పండుగ సీజన్ కోసం సాధారణ ప్రజలే కాదు టీఆర్ ఎస్ నేతలు పలువురు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం సారు దసరాకు చేపడతారన్న సమాచారమే. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గం పరిమితంగా ఉండటం.. పలువురు ముఖ్యులను మంత్రివర్గంలోకి తీసుకోకపోవటం ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.

తన కొడుకు కేటీఆర్.. మేనల్లుడు హరీశ్ తో పాటు..పలువురు సీనియర్లకు పదవులు ఇవ్వకుండా తీసుకున్న కేసీఆర్ నిర్ణయం అప్పట్లోనే హాట్ టాపిక్ గా మారింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పినా.. ఆ ఎన్నికల్లో కేసీఆర్ కోరుకున్న పరిణామాలు చోటు చేసుకోవటం తర్వాత.. అసలుకు ఎసరు వచ్చినట్లుగా పార్టీకి ఇబ్బందికర ఫలితాలు ఎదురయ్యాయి. దీంతో..మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం వాయిదా పడింది.

కట్ చేస్తే.. ఈ దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీంతో ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. కానీ.. వారెవరిని కేసీఆర్ దగ్గరకు రానివ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరికి పదవులు వస్తాయి? అన్నది పెద్ద సందేహంగా మారింది. ఇదిలా ఉంటే.. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. కేటీఆర్.. హరీశ్ లకు ఈసారి కేబినెట్ లో చోటు లభిస్తుందా? అన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్ కు బెర్త్ ఖాయమని.. హరీశ్ కు మాత్రం చోటు లభించే ఛాన్స్ ఉండదంటున్నారు.

ఎందుకిలా? అంటే.. దీనికి పెద్ద కారణమే ఉందంటున్నారు. తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ ను చెప్పకనే చెప్పేసిన కేసీఆర్.. ఆ దిశగా గడిచిన ఐదేళ్లుగా అవసరమైన ప్రతి సందర్భంలోనూ సంకేతాల్ని ఇస్తూ వచ్చారు. దీనిపై హరీశ్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. అలా అని బయటపడలేక లోలోన మధనపడుతున్నారు. 

దసరా సందర్భంగా కేబినెట్ ను విస్తరించే క్రమంలో కేటీఆర్ తో పాటు హరీశ్ కు కూడా మంత్రి పదవి ఇస్తే.. ఇద్దరికి సమ ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని.. అదే జరిగితే ఇంతకాలం హరీశ్ ను పక్కన పెట్టిన దానికి అర్థం ఉండదు సరికదా.. పార్టీలో రెండు కూటములను కేసీఆరే స్వయంగా తెరిచినట్లు అవుతుందంటున్నారు.

ఈ కారణంతోనే.. కేటీఆర్ కు బెర్త్ కన్ఫర్మ్ చేసి.. హరీశ్ కు ఎలాంటి పదవి ఇవ్వకుండా చేస్తారన్న మాట వినిపిస్తోంది.అదే జరిగితే.. కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో కాలమే బాగా చెబుతుందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News