సారు విస్తరణలో సామాజిక లెక్కలు

Update: 2019-09-08 04:57 GMT
అయితే ఆరు. లేకుంటే తొమ్మిది మందిని మంత్రివర్గంలోకి కేసీఆర్ తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ ఆరుగురి ఎంపికలో కేసీఆర్ లెక్కలేంటి? ఏ కాంబినేషన్ లో ఆయన పదవుల పంపకాలు చేపట్టారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విస్తరణలో మంత్రి పదవులు ఖరారైన వారిలో కేటీఆర్.. హరీశ్ ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిద్దరికి బెర్త్ పక్కా. వీరిద్దరూ వెలమ సామాజికవర్గానికి చెందిన వారు. గతంలోనూ మంత్రులుగా చేసిన వారే. ఈసారి ఆలస్యంగా వారిని మంత్రివర్గంలో తీసుకుంటున్నారని చెప్పాలి.

కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు చోటు లభించటం లేదన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. దీనికి చెక్ పెట్టేందుకు వీలుగా సబితను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లోకి విలీనం చేసిన నేపథ్యంలో ఆమెకు కేబినెట్ లో చోటు లభించనుంది. రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే ఆమెకు సీటు ఖాయం. కేబినెట్ లో ఒక్క మహిళ ఉండే కన్నా మరొకరు కూడా ఉండాలన్న నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారని.. ఇందులో భాగంగా ఎస్టీ (లంబాడి) వర్గానికి చెందిన సత్యవతి రాథోడ్ కు చోటు కల్పించనున్నారు. ఈసారి కేబినెట్ లో ఇద్దరు మహిళలకు అవకాశం ఉంటుందని ఇప్పటికే అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. వీరిద్దరికి చోటు ఖాయమని చెప్పకతప్పదు.

మిగిలిన ఇద్దరిలో గంగుల కమలాకర్.. పువ్వాడ అజయ్ కుమార్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో గంగుల మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. పువ్వాడ అజయ్ కుమార్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఖమ్మం జిల్లాలో పార్టీ పరువును కాపాడిన పువ్వాడకు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా సానుకూల సంకేతాల్ని ఇవ్వటంతోపాటు.. కమ్మ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించిన సంకేతాల్ని ఆ వర్గానికి పంపాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుబుతున్నారు.
Tags:    

Similar News