అందరికీ దీపావళి 27న.. కేసీఆర్ కు మాత్రం ముందే?

Update: 2019-10-22 05:30 GMT
ఈ ఏడాది దీపావళి అక్టోబరు 27. అంటే.. మరో ఐదు రోజులు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం ఈ నెల 24నే దీపావళి పండుగ కానుందని చెబుతున్నారు. మిగిలిన వారి కంటే మూడు రోజుల ముందుగా కేసీఆర్ కు దీపావళి పండుగ వచ్చేయటం ఖాయమంటున్నారు. దీనికి కారణం హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాలు ఆ రోజు వెలువడటమే.  పోలింగ్ ముందు రోజు వరకూ విపరీతమైన ఉత్కంటలో ఉన్న గులాబీ క్యాంప్.. పోలింగ్ మొదలైన తర్వాత కాస్త తగ్గినట్లుగా చెబుతున్నారు.

పోలింగ్ జరిగిన తీరుతో వారిలో నమ్మకం పెరగటమే కాదు.. పోలింగ్ ట్రెండ్ ను విశ్లేషించేందుకు ప్రత్యేక మంత్రాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గం మొత్తం పోలింగ్ ఒకేలా సాగినట్లుగా గుర్తించిన వారు.. విజయంపై లెక్కలు వేసుకొని.. ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయన్న విషయం అర్థమైనప్పటికీ నుంచి మరింత ఉత్సాహంగా వ్యవహరించారని చెబుతున్నారు.

పోలింగ్ ముందు రోజు వరకూ గెలిస్తే పదివేలు అన్నట్లుగా వినిపించిన మాటలకు భిన్నంగా.. పాతిక వేలకు పైనే మెజార్టీ ఖాయమని.. అది మరింత పెరిగినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. పోలింగ్ ముందు రోజు చోటు చేసుకున్న పరిణామాలు తుది ఫలితం మీద ప్రభావాన్ని చూపించినట్లుగా చెబుతున్నారు. పరిస్థితి సానుకూలంగా లేదన్న రిపోర్టలతో హుజూర్ నగర్ సభకు వెళ్లకుండా ఉండాలనుకున్న కేసీఆర్ కు.. అనుకోని వరంలా వర్షం వచ్చి ఆదుకున్నట్లుగా చెప్పక తప్పదు.

అలాంటి పరిస్థితి నుంచి పాతిక వేలకు పైనే మెజార్టీ అని బల్లగుద్ది మరి చెప్పే పరిస్థితిలోకి గులాబీ దళం వచ్చిన నేపథ్యంలో ఈ నెల 24న ఫలితాల వెల్లడి సాంకేతిక అంశంగా కేసీఆర్ అండ్ కో ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. దసరాకు తీవ్ర ఒత్తిడిలో ఉన్న కేసీఆర్ కు దీపావళి రావటానికి మూడు రోజుల ముందే పండుగ వచ్చేయటం ఖాయమంటున్నారు.
Tags:    

Similar News