ఎన్నిక‌ల ఖ‌ర్చుల‌కు చెక్కులు ఇస్తాన‌న్న కేసీఆర్‌

Update: 2017-10-27 11:30 GMT
ఏమాట‌కు ఆ మాటే.. ఏం చేయాల‌న్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కే సాధ్యం. కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న చెప్పే మాట‌లు భ‌యాన్ని క‌లుగ‌జేస్తాయి. అదే స‌మ‌యంలో మ‌రికొన్ని సంద‌ర్భాల్లో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తాయి. సుదీర్ఘంగా సాగ‌నున్న వ‌ర్షాకాల అసెంబ్లీ స‌మావేశాలు స్టార్ట్ కానున్న వేళ‌.. కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు విన్న గులాబీ ఎమ్మెల్యేలంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

నోట్లో ఒక ల‌డ్డూ.. రెండు చేతుల్లో రెండు భారీ ల‌డ్డూలు పెడితే ఎంత సంతోషంగా ఉంటుందో.. అంత‌కు మించిన రీతిలో ఎన్నిక‌ల వేళ‌.. త‌న ఎమ్మెల్యేలు ఎంత ద‌ర్జాగా ఉండొచ్చో చెప్పుకొచ్చారు. మొన్న‌టికి మొన్న ప‌నితీరు ఆధారంగా టికెట్లు ఇస్తాన‌ని.. కొడుకైనా.. మేన‌ల్లుడైనా ఎవ‌రైనా త‌న‌కు ఒక్క‌టే అంటూ ఆగ్ర‌హానికి భిన్నంగా టికెట్ల కోసం పైర‌వీలు వ‌ద్ద‌ని.. సిట్టింగులంద‌రికి టికెట్ గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు.

అంతేనా.. మారిన కాలంలో ఎన్నిక‌లు మ‌హా ఖ‌రీదెక్కిపోయిన నేప‌థ్యంలో ఖ‌ర్చు గురించి ఆలోచించొద్ద‌న్న అభ‌యాన్ని ఇవ్వ‌టంతోపాటు.. టికెట్ తోపాటు ఖ‌ర్చుల‌కు అవ‌స‌ర‌మైన మొత్తాన్ని చెక్కు రూపంలో ఇస్తాన‌ని చెప్పి ఎమ్మెల్యేలంతా సంబ‌ర‌ప‌డిపోయే మాట చెప్పారు.

ఎన్నిక‌ల వేళ‌.. టికెట్ ఇస్తారో లేదో త‌ర్వాత సంగ‌తి తాజాగా కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల‌తో గులాబీ ఎమ్మెల్యేలు క‌ల‌ల్లో విహ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందే టికెట్లు ఇచ్చేస్తాన‌ని.. చివ‌రి నిమిషం వ‌ర‌కూ టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా తేల్చేశారు. త‌న‌కున్న అంచ‌నాల ప్ర‌కారం 96 సీట్ల‌లో విజ‌యం ప‌క్కా అని.. ప్ర‌య‌త్నిస్తే 106 సీట్ల‌లో గెలుపు గ్యారెంటీ అన్న ధీమా వ్య‌క్తం చేసిన కేసీఆర్‌.. ఎన్నిక‌ల వేళ ద‌ర్జాగా వెళ్లి ద‌ర్జాగా గెలిచి రావాలన్న మాట‌ను చెప్పారు.

విప‌క్షాలు బ‌లంగా లేవ‌ని.. ఎన్నిక‌ల్లో ఎలా గెల‌వాలో త‌న‌కు బాగా తెలుస‌న్న ఆయ‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కోసం ఎవ‌రూ పైర‌వీలు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రిగితే మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని.. అందుకు మూడు నెల‌ల ముందే టికెట్లు ఇచ్చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

స‌మావేశంలో 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత 96 మంది గెల‌వ‌టం ఖాయ‌మ‌ని.. 106 స్థానాల్లో గెలిచే వ‌ర‌కూ త‌మ‌కు అవ‌కాశం ఉంద‌న్న మాట‌ను చెప్పారు. సిద్దిపేట‌లో తాను గ‌ట్టిగా ప‌ని చేసినా 1989లో ఓడిపోయాన‌ని.. దాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప‌ని చేసి 1992లో మ‌ళ్లీ గెలిచిన విష‌యాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం అని.. వారి ఇలాకాల్లో మంత్రులు.. ఎమ్మెల్సీలు వేలు పెట్టొద్దంటూ హెచ్చ‌రించారు. తెలంగాణ టీడీపీ ఉనికి లేద‌ని చెప్పిన కేసీఆర్ పోటీ అంతా కాంగ్రెస్ తోనేన‌ని చెప్పారు. విపక్షం బ‌లంగా లేద‌ని.. ఆ పార్టీ నేత‌లు పిచ్చి పిచ్చిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. చ‌ట్ట‌స‌భ‌ల్లో మాట్లాడ‌కుండా రోడ్ల మీద ప‌డుతున్నార‌న్నారు. మొత్తంగా చూస్తే కేసీఆర్ త‌న మాట‌ల‌తో సిట్టింగుల్లో ఆత్మ‌విశ్వాసాన్ని పెంచ‌టంతో పాటు.. టికెట్ల మీద ఉన్న సందేహాల్ని తీర్చేలా మాట్లాడార‌ని చెప్పాలి. విపక్షాల మీద విరుచుకుప‌డేందుకు వీలుగా ఎమ్మెల్యేల‌కు ద‌ర్జా బూస్ట్‌ ను కేసీఆర్ ఇచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News