ఆ చ‌ర్చ‌ల్లో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నార‌బ్బా?

Update: 2018-05-03 14:30 GMT
కొద్ది రోజుల క్రితం ప్ర‌ధాని మోదీ పై విరుచుకుప‌డ్డ తెలంగాణ సీఎం కేసీఆర్....థ‌ర్డ్ ఫ్రంట్ పెట్టబోతున్న‌ట్లు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ప‌లు రాష్ట్రాల సీఎంల మ‌ద్ద‌తు కూడా త‌న‌కుంద‌ని కేసీఆర్...ప్ర‌క‌ట‌న‌లు గుప్పించేశారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్...ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని కూడా క‌లిశారు. తాజాగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను క‌లిసిన కేసీఆర్ ఈ విష‌యంపై తీవ్రంగా చ‌ర్చించార‌ట‌. కొద్ది రోజుల క్రితం డీఎంకే అధినేత కుమార్తె క‌నిమొళితో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. ఇంత‌మందిని క‌లిసిన కేసీఆర్....వారితో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఆవ‌శ్య‌క‌త‌ను గురించి...చర్చించి ఉంటార‌నుకోవ‌డం స‌హ‌జం. అయితే, తాజాగా, అందుకు భిన్నంగా క‌నిమొళి ...ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. కేసీఆర్‌తో డీఎంకే జ‌రిపిన చర్చల్లో థ‌ర్డ్ ఫ్రంట్ ప్రస్తావన రాలేదని కనిమొళి తేల్చి చెప్పేశారు. దీంతో, అస‌లు కేసీఆర్ ...థ‌ర్డ్ ఫ్రంట్ చ‌ర్చ‌ల‌లో స‌ఫ‌ల‌మైన‌వి ఎన్ని....విఫ‌ల‌మైన‌వి ఎన్ని అన్న సందేహాలు ప‌లువురు లేవ‌నెత్తుతున్నారు. అస‌లింత‌కీ కేసీఆర్ ఆ సమావేశాల్లో ఏం చేస్తున్నార‌ని జుట్టుపీక్కుంటున్నారు.

డీఎంకే నేతలను కేసీఆర్ కలిశార‌ని, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చ‌ర్చించార‌ని టీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఓ ర‌కంగా త‌మ ఫ్రంట్ లోకి డీఎంకే కూడా చేరింద‌ని వారు భావించారు. అయితే, ఆ భేటీపై క‌నిమొళి స్పంద‌న వేరేలా ఉంది. తాము రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించామని, కేంద్రం తీరుపై కేసీఆర్ మండిప‌డ్డార‌ని తెలిపారు. క‌నిమొళి మాత్ర‌మే కాదు....ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దాదాపుగా ఇలాగే స్పందించారు. అంత‌కుముందు మ‌రి కొంత‌మంది ముఖ్య‌మంత్రులు...ప్రాంతీయ పార్టీల నేత‌లది కూడా ఇదే మాట‌. అయితే, బెంగాల్ సీఎం మమత మాత్రం....ఆ విష‌యం చ‌ర్చించామ‌ని....కాంగ్రెస్ లేని థ‌ర్డ్ ఫ్రంట్ కుద‌ర‌క‌పోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, తాజాగా కేసీఆర్ ను క‌లిసిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చార‌ట‌. అంతేకాకుండా, కాంగ్రెస్ ను మరీ తక్కువ అంచనా వేయ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికాడ‌ట‌.

ఈ మొత్తం వ్య‌వ‌హారం చూస్తుంటే....అనుకున్న‌దొక‌టి...అయిన‌ది ఒక్క‌టి త‌ర‌హాలో కేసీఆర్ ప‌రిస్థితి ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. బీజేపీ, కాంగ్రెస్ లు లేని తృతీయ ఫ్రంట్ అన‌గానే....అంద‌రూ త‌న వెంట ప‌రిగెత్తుకు వ‌స్తారని భావించిన కేసీఆర్ భంగ‌ప‌డ్డ‌ట్లు అనిపిస్తోంది. అంతన్నాడింత‌న్నాడే గంగ‌రాజు.....ముంత‌మామిడి పండ‌న్నాడే గంగ‌రాజు.....త‌ర‌హాలో తానే థ‌ర్డ్ ఫ్రంట్ కు నాయ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాన‌ని.....ఆ మాట‌కొస్తే తెలంగాణ ఉద్య‌మాన్ని ఉర‌క‌లు పెట్టించిన తానే కాబోయే ప్ర‌ధాని అన్న త‌ర‌హాలో కేసీఆర్ కొద్దిగా అతి విశ్వాసంతో వ్యవ‌హ‌రించిన‌ట్లు అనిపించ‌క‌మాన‌దు. త‌న‌దైన ఊహాలోకంలో నుంచి కేసీఆర్ ఓ మెట్టుదిగి....వాస్త‌వాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే బాగుంటుంది. బీజేపీపై వ్య‌తిరేక‌తను క్యాష్ చేసుకోవ‌డం వ‌ర‌కూ ఓకే...కానీ, దేశంలోని అతి పెద్ద‌...పురాత‌న పార్టీ అయిన కాంగ్రెస్ ను పూచిక పుల్ల‌లా తీసివేయ‌డంపై ప‌లువురు పెద‌వి విరుస్తున్నార‌న్న సంగ‌తిని కేసీఆర్ గ్ర‌హించాలి. మ‌రి, అఖిలేష్..క‌నిమొళి తాజా వ్యాఖ్య‌ల త‌ర్వాత థ‌ర్డ్ ఫ్రంట్ పై కేసీఆర్ ఎలా ముందుకు పోతారో వేచి చూడాలి.

Tags:    

Similar News