రూ.2 త‌గ్గించిన ఏపీ.. తెలంగాణ మాటేంది?

Update: 2018-09-11 05:05 GMT
అంత‌కంత‌కూ పెరుగుతూ.. ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకెళుతున్న పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లకు క‌ళ్లాలు వేయ‌టానికి.. త‌మ‌కు వ‌చ్చే ఆదాయంలో కొంత త‌గ్గించుకొని ప్ర‌జ‌ల్ని బాదేసే ప్రోగ్రామ్‌ను కాస్తంత త‌క్కువ చేసేందుకు అటు కేంద్రానికి కానీ.. ఇటు రాష్ట్ర  ప్ర‌భుత్వాల‌కు ప‌ట్ట‌ని వైనం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెరుగుతున్నాయంటూ నిర్మోహ‌మాటంగా బాదేసే కార్య‌క్ర‌మం అంత‌కంత‌కూ పెరుగుతోందే త‌ప్పించి త‌గ్గ‌ని ప‌రిస్థితి. ఇలాంటి వేళ స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్న వేళ‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు లీట‌రు పెట్రోల్‌.. డీజిల్ పైన రూ.2 చొప్పున వ్యాట్ త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ఏదో చేస్తున్న‌ట్లుగా తెగ ప్ర‌చారం చేసుకునే చంద్ర‌బాబు.. పెట్రో ఉత్ప‌త్తుల‌పై ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగేలా.. భారీ నిర్ణ‌యాన్ని తీసుకునేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని ప‌రిస్థితి.

ఈ విష‌యంలో తెలంగాణ‌లోనూ ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. ప్ర‌స్తుతం కేసీఆర్ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా ఉన్న నేప‌థ్యంలో పెట్రో ఉత్ప‌త్తుల‌పై వ్యాట్ త‌గ్గింపు నిర్ణ‌యాన్నితీసుకునేందుకు ప‌రిమితులు ఎదుర‌వుతున్న‌ట్లుగా చెబుతున్నారు. కార‌ణం ఏమైనా కానీ.. పెట్రో బాదుడు నుంచి ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగేలా అటు కేంద్ర‌మే కాదు.. ఇటు రాష్ట్రాలు కూడా ప్ర‌య‌త్నించ‌ని వైనం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News