బౌద్ధ ముద్ర కోసం ఆరాటం, పోరాటం!

Update: 2015-09-14 04:10 GMT
బౌద్ధం అంటేనే పోరాటాలను విడిచిపెట్టమని శాంతి మార్గాన్ని ప్రబోధించిన తత్వమే కావచ్చు గాక.. కానీ.. బౌద్ధం తాలూకు ఆనవాళ్లను తమవి ప్రపంచానికి తెలియజెప్పడానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆరాటపడుతోంది. ఇందుకోసం.. తమ ప్రాంతానికి చెందిన బౌద్ధ ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతానికి తరలిపోయాయంటూ.. వాటిని తిరిగి వెనక్కు తెప్పించుకోవడానికి పోరాటానికి కూడా సిద్ధపడుతున్నది. బౌద్ధం కోసం తెలంగాణ ప్రభుత్వం హఠాత్తుగా ఇంతగా ఆలోచిస్తుండడం వెనుక మతలబు ఏమిటి? తమ ప్రాంతంలో ఆనాడు పరిఢవిల్లిన సదరు మతాల సంస్కృతిని కాపాడుకోవడమే లక్ష్యం అయితే గనుక.. బౌద్ధ - జైన మతాలకు చెందిన ప్రదేశాలు తెలంగాణలో అనేకం ఉన్నాయి. కనీస పర్యాటక స్థాయి సదుపాయాలు కూడా లేకుడా అవి కునారిల్లుతున్నాయి. అలాంటివాటిని చక్కబరచవచ్చు కదా.. అలాగేమీ చేయకుండా.. ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లిన బౌద్ధశిధిలాల గురించి ఇప్పుడు పోరు ఏమిటి అని పలువురు అనుకుంటున్నారు.

ఒకవైపు చంద్రబాబునాయుడు ఏపీ రాజధాని నగరాన్నే బౌద్ధానికి ప్రతిరూపమా అన్నట్లుగా తీర్చిదిద్దడానికి సిద్ధపడుతున్నారు. ఏకంగా రాజధాని నగరం పేరునే 'అమరావతి' అని పెట్టడం ద్వారా చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద బౌధ్ద పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా అమరావతిని ఆయన తీర్చిదిద్దే ఉద్దేశంతో ఉన్నట్లుగా కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తగినట్లుగానే బౌద్ధం ప్రబలంగా ఉన్న జపాన్‌ - చైనా - సింగపూర్‌ తదితర ఆసియా దేశాల భాగస్వామ్యంతోనే ఈ అమరావతి నగర నిర్మాణం మొత్తం జరగబోతున్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన బౌద్ధ వారసత్వ సంపదనంతా ఏపీకి గతంలో తరలించుకుపోయారంటూ.. దాన్ని తిరిగి ఇవ్వాలంటూ ఇప్పుడు కొత్త రగడ మొదలవుతున్నది.

హఠాత్తుగా ఇప్పుడే బౌద్ధం మీద, బౌద్ధ వారసత్వ పరిరక్షణ మీద తెలంగాణ సర్కారుకు ఇంత ప్రేమ పొంగుకురావడం ఏంటి? అంటే, దీనికి కారణాలు చైనా టూర్‌ లో ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ఏపీ ఏయే దేశాల మీద అయితే పెట్టుబడులకు నిర్మాణ భాగస్వామ్యానికి ఆధారపడుతున్నదో ఆయా దేశాల్లో బౌద్ధానికి ఉన్న ప్రాధాన్యం ఏమిటో.. చైనా టూర్‌ కు వెళ్లినప్పుడు.. కేసీఆర్‌ బృందానికి అర్థమై ఉంటుందని.. అందుకే ఇలాంటి సంపన్న ఆసియా దేశాలను తమవైపు కూడా ఆకర్షించడానికి .. తమ వద్ద ఉన్న బౌద్ద ఆనవాళ్లను కాపాడుకోవడానికి ఇప్పుడు తపన పడుతున్నారని అనుకుంటున్నారు.

ఒకవైపు ఏపీలోని బౌద్ద వారసత్వ చిహ్నాలే చెన్నై - లండన్‌ మ్యూజియంలకు తరలిపోయాయని ఆ రాష్ట్ర సర్కారు వాటిని తెప్పించుకునే ప్రయత్నాల్లో ఉంది. కాలచక్ర సమయంలో తెలంగాణ నుంచి పంపిన బౌద్ధ చిహ్నాల గురించి ఇన్నాళ్లు పట్టించుకోకుండా.. ఇప్పుడు యాగీ చేయడం చిత్రంగా ఉంది.
Tags:    

Similar News