ఆంధ్రోళ్లను ఉడికిస్తున్న కేసీఆర్ మాటలు

Update: 2017-02-16 06:56 GMT
విడిపోయి కలిసి ఉందామన్నది విభజన సందర్భంగా తెలంగాణ ఉద్యమనేతలు పదే పదే చెప్పిన మాట. ఉమ్మడి రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందన్న వాదనతో రాష్ట్ర విభజనకు ఉద్యమ శంఖాన్ని పూరించారు. అందుకు తగ్గట్లు తమ వాదనను సమర్థంగా వినిపించటంలో తెలంగాణ నేతలు సక్సెస్ అయ్యారు. దీంతో.. గడిచిన 60 ఏళ్లలో తెలంగాణకు అన్యాయానికి మించిన నష్టాన్ని ఆంధ్రాకి కట్టబెడుతూ విభజన రేఖల్ని గీసేసింది కేంద్రం.

ఒక సమస్యను పరిష్కరించటానికి మరో సమస్యకు తెర తీసేలా విభజన జరిపిన విధానం ఉందన్న విమర్శల్ని కేంద్రంలోని నాటి యూపీఏ పెద్దలకు అస్సలు పట్టలేదు. అందుకే ఆంధ్రోళ్లకు జరిగే అన్యాయాన్ని ప్రత్యేకహోదాతో సరి చేస్తామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో.. విభజనను కోరిన తెలంగాణ ప్రాంత నేతలు.. వారికి వత్తాసుగా వాయిస్ వినిపించిన మేధావులు.. మీడియా పెద్దలతో సహా.. అందరూ ఆంధ్రాకు అన్యాయం జరుగుతుందన్న మాట అయితే చెప్పారే కానీ.. దానికి పరిష్కారం మీద నోరు విప్పితే ఓట్టు. దీంతో.. ఏపీకి హామీలు తప్పించి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే విభజన ప్రక్రియను పూర్తి చేశారు.

విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టం అంతాఇంతా కాదు. రాష్ట్ర రాజధాని అన్నది లేకుండా పోవటమే కాదు.. ఆదాయాన్ని అందించే హైదరాబాద్ చేజారటమే కాదు.. భారీ అప్పులు మిగిలాయి. ఇక.. తవ్వుకుంటే తవ్వుకున్నన్ని కష్టాలు.. బాధలు మిగిలాయి. దశాబ్దాల పాటు రాజధానిని నిర్మించుకోవటానికి అవసరమైన నిధులు  తెచ్చుకోవటానికే శక్తిసామర్థ్యాల్ని ఖర్చు చేయాల్సిన దుస్థితి. దీంతో..  పక్కనోడితో పోటీ పడటం వదిలేసి.. ఇంటిని చక్కదిద్దుకోవటానికే సమయాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి.

కొండలా పెరిగిపోతున్న రుణభారం.. ప్రభుత్వాన్ని నడిపేందుకు ఎప్పటికప్పుడు అప్పులు తెచ్చుకోవటం.. అంతకంతకూ పెరిగిపోయే వడ్డీ భూతం మీదకు విరుచుకుపడకుండా ఉండటం కోసం ప్రజల మీద కొత్త.. కొత్త పన్నుల భారాన్ని మోపుతూ పాలనా బండిని నడిపించాల్సి వస్తోంది. ఇన్ని తిప్పలు పడుతున్నప్పటికీ.. విభజనకు ముందు పంచాయితీల పేరుతో.. తరచూ ఏదో ఒక మాటను తెలంగాణ పాలకుల చేత అనిపించుకోవాల్సి వస్తోంది.

ఇది మరికాస్త అర్థం కావాలంటే.. పెళ్లి చేసుకున్న మొగుడు.. పెళ్లాలు కాపురం చేయటం కుదరక.. విడాకులు తీసుకున్నారనుకుందాం. పెద్దల సమక్షంలో లెక్క తేలిపోయి.. ఎవరికేం ఇవ్వాలో తేల్చేశారనుకుందాం. ఇక.. మీ బతుకులు మీరు బతకండని అన్నారనుకుందాం. అప్పటి నుంచి ఎలా ఉండాలి. ఎవరి దారి వారిదన్నట్లు ఉండాలి. పాత బంధం తాలూకు ఇబ్బందులు ఎదురైతే.. హుందాగా వ్యవహరించాలే కానీ.. మా కాపురంలో అలా జరిగింది.. ఇలా జరిగిందని అదే పనిగా అంటే ఎలా ఉంటుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇంచుమించు ఇదే తీరులో ఉంటుంది.

పంచాయితీలు వద్దు కూర్చొని మాట్లాడుకుందామని చెప్పే పెద్దమనిషి.. మరికొన్ని సందర్భాల్లో పాత బంధంలో తామెంత దగా పడ్డామో చెప్పేస్తుంటారు. మాట తీస్తే మాట వస్తుంది. అయినదేదో అయిపోయిందన్నట్లు కాకుండా.. ప్రతిసారి తవ్వుతున్న వైనం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిని బాధిస్తుందన్న విషయాన్ని ఆయన పట్టించుకోరు. విభజన కారణంగా ఆంధ్రాకు ఈ రోజు జరిగిన నష్టానికి కేంద్రం తీరునే ప్రశ్నిస్తారు కానీ.. కేసీఆర్ చేసిన ఒత్తిడి వల్లనో.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన లోగుట్టు ప్రయత్నాల మీద ఎవరూ ఎప్పుడూ మాట్లాడింది లేదు.

విడిపోయాక వచ్చే చిన్న చిన్న చికాకులకు పరిష్కారం కోసం ప్రయత్నించాలే కానీ.. గతాన్ని తవ్వుకోవటమే పనిగా పెట్టుకుంటే.. ఎదుటివారి మనోభావాలు దెబ్బతింటాయన్న చిన్న విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పట్టించుకోరన్నది ప్రశ్న. నిజానికి ఆయన్నేకాదు.. ఆంధ్రా పాలక పక్షాన్ని కూడా ఇదే ప్రశ్నను సంధించాలి. ఉద్యమ సమయంలో ఆంధ్రావాదన వినిపిస్తే.. తెలంగాణలో తమ పార్టీకి ఇబ్బంది అన్న ఉద్దేశంతో రెండు కళ్ల సిద్ధాంతం పేరిట చెప్పిన మాటల్ని మర్చిపోకూడదు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎంతన్నది బాబుకు తెలిసిందే. మరి.. అధికారాన్ని అప్పగించిన ఆంద్రా వారి సంక్షేమం.. వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఎందుకు ప్రయత్నించరన్నది పెద్ద ప్రశ్న.

తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీళ్ల పంచాయితీ నేపథ్యంలో.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్నే చూస్తే.. ‘‘సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అనుసరించిన వివక్షాపూరిత విధానాల వల్ల తెలంగాణ ప్రాంతం ఎంతో నష్టపోయింది. కేఎల్ రావు అనే ఇంజనీరు తెలంగాణకు అన్యాయం చేశారు. సాగర్ కుడి కాల్వకు ఎక్కువ.. ఎడమ కాల్వకు తక్కువ నీరు అందేలా డిజైన్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రాకు నీరు మళ్లించినందుకు కేఎల్ రావును అక్కడ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమైక్య రాష్ట్రంలో ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరిగాయి’’ అంటూ కేసీఆర్ మాటలు వింటే.. ఆంధ్రోళ్ల మనసుల్ని చివుక్కుమనటం ఖాయం.

నిజంగా నాడేం జరిగింది? దానికి కారణాలు ఏమిటన్న విషయాన్ని సమర్థవంతంగా వాదనలు వినిపించాల్సిన ఏపీ పాలకపక్షం నోరుమూసుకొని ఉండటంతో.. ఆంధ్రా వాదన వినిపించని పరిస్థితి. ఇలాంటి ప్రచారంతో ఆంధ్రోళ్లు మోసకారులు.. దుర్మార్గులుగా చరిత్రలో నమోదు అవుతుందన్న బాధను ఆంధ్రోళ్లు వ్యక్తం చేస్తున్నారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. సొంత రాష్ట్రం గురించి సొంత ప్రజల ఆత్మాభిమానం గురించి ఏపీ పాలకులకు పట్టకపోవటమే. ఇలాంటి అవమానాలతో గుండె రగులుతున్న ఆంధ్రోళ్లు.. ఏపీ పాలకుల్ని ప్రశ్నించటం ద్వారా.. వారిని నిలదీయటం ద్వారా ఏపీ వాదనను తెరపైకి వచ్చేలా చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే.. ఈ అవమానాలు ఇప్పుడే కాదు..  భవిష్యత్ తరాల్ని వెంటాడుతుంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Tags:    

Similar News