వార్ వ‌న్ సైడ్ అయ్యాక కేసీఆర్ ఏమ‌న్నారు?

Update: 2016-02-05 15:25 GMT
ఇలాంటి విజ‌యం ఎప్పుడైనా చూశామా.. ఇలాంటి గెల‌పు గురించి ఎప్పుడైనా విన్నామా అన్న రీతిలో గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కారు దూసుకెళ్లింది. కారు స్పీడ్‌ కి ప్ర‌త్య‌ర్థి పార్టీలు చెల్లాచెదురైపోయారు. ఇంత సునామీలోనూ.. త‌ట్టుకొని నిలిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది మ‌జ్లిస్ ఒక్క‌టే. మా ఇలాకాలో అడుగుపెడ‌తావా? అంటూ అస‌ద్ ఎందుకంత ధీమాగా మాట్లాడార‌న్న విషయాన్ని తాజా గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాలు రుజువు చేశాయి. గ్రేట‌ర్ లో మ‌జ్లిస్ గెలుపు గురించి ప‌క్క‌న పెడితే.. వార్ వ‌న్ సైడే అన్న‌ట్లుగా ఇర‌గ‌దీసిన టీఆర్ ఎస్ చారిత్ర‌క విజ‌యం త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా విజ‌యానందాన్ని ఏ మాత్రం ప్ర‌ద‌ర్శించ‌ని ఆయ‌న‌.. ఒద్దిక‌గా మాట్లాడుతూ.. పార్టీ నేత‌లంతా అణుకువగా ఉండాల‌న్న హిత‌వు ప‌లికారు. గ్రేట‌ర్ ప్ర‌జ‌లిచ్చిన తాజా తీర్పుతో గ‌ర్వం.. అహంకారం అన్న‌ది ఉండ‌కూద‌ని.. అణుకువ‌తో ఉంటూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హించాలంటూ పెద్ద‌మ‌నిషి త‌ర‌హాలో మాట్లాడారు.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాలకు సంబంధించిన ప‌ట్టిక‌ చూసిన‌ప్పుడు.. హైద‌రాబాదీయుల తీర్పు ఎంత విస్ప‌ష్టంగా ఉంద‌న్న విష‌యం మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది. విప‌క్షాలు ముఖం చూపించుకునేందుకు సైతం చిన్న‌బోయేలా తీర్పు ఇవ్వ‌టంతో ముఖం మీద నెత్తురు చుక్క లేని ప‌రిస్థితి. ఇంత అద్భుత విజ‌యాన్ని సాధించిన త‌ర్వాత కూడా కేసీఆర్ ఆచితూచి మాట్లాడారే త‌ప్పించి.. తొంద‌ర‌ప‌డి ఒక్క‌మాట కూడా అన‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. కేసీఆర్ సైతం క‌ల‌లో కూడా ఊహించ‌ని ఈ ఫ‌లితాల వెల్ల‌డి త‌ర్వాత ఆయ‌నేం మాట్లాడారు..? ఏయే అంశాల్ని ప్ర‌స్తావించారు? లాంటి విష‌యాల్లోకి వెళితే..

= ఈ అద్భుత విజ‌యాన్ని అందించిన గ్రేట‌ర్ ప్ర‌జ‌ల‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా.

=  అహ‌కారం వ‌ద్దు.. గ‌ర్వం అస‌లే ప‌నికి రాదు. అణుకువ‌గా ఉండాలి. ఈ విజ‌యంతో పెద్ద బాధ్య‌త పెరిగింది. మ‌న‌మీద బ‌రువు మోప‌బ‌డింద‌న్న విష‌యాన్ని పార్టీ నేత‌లు గుర్తించాలి.

= ఇలాంటి గెలుపు ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డితే త‌ప్ప క‌ష్ట‌ప‌డితే వ‌చ్చేది కాదు.

= జ‌ర్న‌లిస్టు మిత్రులు కూడా మాకే ఓటేశారు. లేక‌పోతే ఇంత గెలుపు సాధ్యం కాదు. ఇదో గొప్ప విజ‌యం. అంతే గొప్ప‌గా సేవ చేసి మేమేంటో నిరూపించుకుంటాం.

= ఈ మ‌ధ్య‌నే ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీల‌ను క‌లిసిన సంద‌ర్భంలో డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల గురించి గ్రేట‌ర్ ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆశిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన మాట‌కు త‌గ్గ‌ట్లే ల‌క్ష డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను క‌ట్టిస్తాం. గ్రేట‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని నూటికి నూరుశాతం అమ‌లు చేస్తాం.

= 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ త‌ప్పించి మిగిలిన అన్నీ హామీల్ని తీర్చేశాం. కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత విద్య మిన‌హా మిగిలిన అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేస్తాం. అదో పెద్ద కార్య‌క్ర‌మం త్వ‌ర‌లో దాన్ని పూర్తి చేస్తాం.

=  ఎన్నిక‌ల ముందు చాలానే అపొహ‌లు సృష్టించారు. అయితే.. హైద‌రాబాదీయులు తాజా తీర్పుతో  తామంతా టీఆర్ ఎస్ వెనుక‌నే ఉన్న‌ట్లు.. కేసీఆర్ వెంట ఉన్న విష‌యాన్ని నిరూపించారు. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా స‌రే.. హైద‌రాబాద్‌లో ఉన్న వారంతా మా బిడ్డ‌లే. మిగిలిన రాష్ట్రాల మాదిరే ఆంధ్రా ప్రాంత సోద‌రులు మా బిడ్డ‌లే. అంద‌రిని క‌డుపులో పెట్టుకొని చూసుకుంటాం. ఈ రాష్ట్రంలో బ‌తికే అంద‌రికి ర‌క్ష‌ణ ఇవ్వ‌టం మా ధ‌ర్మం.ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న అపోహ‌ల్ని ఈ రోజు గ్రేట‌ర్ ప్ర‌జ‌లు ప‌టాపంచ‌లు చేశారు.

= ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌కు త‌గ్గ‌ట్లే జంట‌న‌గ‌రాల నీటి ఎద్ద‌డిని తీర్చేందుకు హైద‌రాబాద్‌కు రెండు రిజ‌ర్వాయ‌ర్లు క‌డ‌తాం. ముంబ‌యి మ‌హాన‌గ‌రంలో మాదిరి ఒక్క‌సెక‌ను కూడా క‌రెంటు పోకుండా చ‌ర్య‌లు తీసుకుంటాం. ముంబ‌యి మ‌హాన‌గ‌రంలో మాదిరి హైలెండ్ విధానంలో రెప్ప‌పాటు కూడా క‌రెంటు పోకుండా చేస్తాం.

= శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో రాజీ ప‌డం. ఎంత పెద్ద వాళ్లు అయినా.. ఐరన్ హ్యాండ్ తో తీసేస్తాం. మేనిఫేస్టోలో చెప్పిన విధంగా అన్ని స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తాం.

= ఇప్ప‌టివ‌ర‌కూ హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉస్మానియా.. గాంధీ ఆసుప‌త్రులే ఉన్నాయి. పేదోళ్ల‌కు ఈ రెండు త‌ప్పితే మ‌రో దిక్కు లేదు. కింగ్ కోఠి ఆసుప‌త్రిని వెయ్యి ప‌డ‌క‌ల ఆసుప‌త్రిగా మారుస్తాం. మ‌రో వెయ్యి ప‌డ‌క‌ల ఆసుప‌త్రులు రెండు క‌ట్టిస్తాం. మొత్తంగా ఐదారు ఆసుప‌త్రులు క‌ట్టిస్తాం. ఆ ఆసుప‌త్రుల్లో ఎంఆర్ఐ స‌హా అన్ని వ‌స‌తులు ఉండేలా చూస్తాం. కిమ్స్‌.. అపోలో.. య‌శోదా ఆసుప‌త్రుల్ని త‌ల‌ద‌న్నేలా క‌ట్టిస్తాం. ఏడాది లోప‌లే ఐదు లేదంటే మ‌రో ఆసుప‌త్రితో క‌లిపి ఆరు ఆసుప‌త్రుల్ని నిర్మిస్తాం. ఇవి కూడా న‌గ‌రంలోని న‌లుమూల‌ల ఏర్పాటు చేస్తాం. అన్ని ప్రాంతాల వారికి సౌక‌ర్య‌వంతంగా ఉండేలా నిర్మిస్తాం.

= హైద‌రాబాద్ ను ట్యూలీ.. గ్లోబ‌ల్ సిటీగా చేస్తాం. ఎన్నిక‌ల సంద‌ర్భంగా విప‌క్షాలు అవాకులు చ‌వాకులు పేలాయి. అలా కాకుండా విమ‌ర్శ‌లు చేస్తే బాగుండేది. చంద్ర‌బాబు.. బీజేపీ.. కాంగ్రెస్ వాళ్లు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. కానీ.. ప్రాంతాలు.. కులాలు.. మ‌తాల‌కు సంబంధం లేకుండా హైద‌రాబాద్ ప్ర‌జ‌లంతా క‌లిసి తీర్పు ఇచ్చారు.

= నారాయ‌ణ నాకు మంచి మిత్రుడు. కె.కేశ‌వ‌రావుకు మ‌రింత మంచి మిత్రుడు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌నేదో మాట్లాడారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎవ‌రో ఆయ‌న జోలికి వెళ్లొద్దు. ఒక చెవి నారాయ‌ణ‌ను చూడ‌లేం. ఆయ‌న రెండు చెవుల‌తో ఉంటేనే బాగుంట‌ది. ఒక చెవి నారాయ‌ణగా బాగోదు. ఆయ‌న జోలికి ఎవ‌రూ వెళ్లొద్దు.

= మేయ‌ర్.. డిప్యూటీ మేయ‌ర్ అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో పార్టీ ముఖ్యులు కూర్చొని రేపు.. ఎల్లుండిలో నిర్ణ‌యం తీసుకుంటాం. ప్ర‌జ‌లు ఇంత భారీ తీర్పును ఇచ్చిన నేప‌థ్యంలో గ్రేట‌ర్ ప‌రిధిలో లంచం లేకుండా ప‌ని జ‌రిగేలా చేయ‌గ‌లిగితే మ‌నం గెలిచిన గెలుపున‌కు అర్థం ఉంటుంది.
Tags:    

Similar News