ఆ రకంగా కేసీఆర్ కు చెక్ పెట్టిన మోడీ

Update: 2016-08-08 07:09 GMT
ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు వచ్చారు.. వెళ్లారు. తమ ముఖ్యమంత్రిని విపరీతంగా కీర్తించి వెళ్లారని తెరాస శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. పైకి అంతా అలాగే కనిపిస్తున్నది గానీ.. మోడీ చాలా నర్మగర్భంగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోకడలకు ఒక రకంగా చెక్ పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ కు ఏదైతే ఇష్టం లేదో, తన  రాష్ట్రంలో మరో గళం వినిపించకుండా, దేన్ని ఎవాయిడ్ చేయడానికి కేసీఆర్ ఈ రెండేళ్ల పదవీ కాలంలో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారో దానికి మోడీ చెక్ పెట్టారని అనుకోవాలి.

వివరాల్లోకి వెళితే.. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం. అయితే దీనిని అధికారికంగా ప్రభుత్వం విమోచన దినంగా నిర్వహించాలని భాజపా చాలాకాలంగా గొడవ చేస్తూనే ఉంది. అయితే అలాంటి వేడుకలు నిర్వహిస్తే - నిజాం వ్యతిరేక వేడుకగా రంగు పులుముకుని - ముస్లింలను అసంత్రుప్తికి గురిచేస్తుందని కేసీఆర్ సర్కారు ఆ డిమాండును పట్టించుకోవడం లేదు.

రాష్ట్రం కోసం పోరాడిన రోజుల్లో విమోచనం దినం అధికారికంగా నిర్వహించాలని కోరిన కేసీఆర్ గద్దె ఎక్కాక కన్వీనియెంట్ గా మరచిపోయారు. అయితే ఇప్పుడు మోడీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తిరంగా యాత్ర దేశమంతటా 15 రోజుల పాటు జరుగుతుంది. అయితే తెలంగాణలో నెల రోజుల పాటూ సెప్టెంబరు 17 వరకు జరుగుతుందని మోడీ సభలోనే ప్రకటించారు. ఈ తిరంగా యాత్ర చివరలో సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని కూడా ఆయన పిలుపు ఇచ్చారు. సెప్టెంబరు 17 దాకా యాత్ర నిర్వహించి - త్యాగాలు నెమరు వేసుకోవడం అంటే అనివార్యంగా.. తెలంగాణ విమోచన కు పాటుపడిన సైనికుల త్యాగాలే స్మరణకు వస్తాయి. మరి అది అధికారికంగా విమోచనదినం నిర్వహించడం లాంటిదే అవుతుంది. ప్రధాని ప్రకటనను కేసీఆర్ ఎలా తీసుకుంటారో - ఈ సెప్టెంబరు 17 లోగా.. మరే మెలికలతో ఈ విమోచన గండం తప్పించుకుంటారో చూడాలి.
Tags:    

Similar News