హైద‌రాబాద్ ప్ర‌క్షాళ‌న ఎప్పుడు కేసీఆర్‌?

Update: 2017-08-26 17:35 GMT
కొన్ని విష‌యాల‌కు చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. త‌న దృష్టికి వ‌చ్చిన అంశాల తీవ్ర‌త‌కు మించి మ‌రీ స్పందిస్తారాయ‌న‌. అసాధ్య‌మ‌నుకునే వాటిని సుసాధ్యం చేసేలా ప్లాన్ చేయ‌టం ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి. ఒక రాష్ట్రం మొత్తాన్ని స్తంభింప‌చేసి.. కోట్లాది మంది డేటాను ఒక్క‌రోజులో పూర్తి చేయ‌టాన్ని ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయినా ఆలోచించ‌గ‌ల‌రా?

అలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యాలు ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి. అంతేనా.. రాష్ట్రం ఏర్ప‌డితే తీవ్ర‌మైన విద్యుత్ స‌మ‌స్య‌తో తెలంగాణ రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతుంద‌ని.. చీక‌ట్లు త‌ప్ప‌వంటూ చేసిన హెచ్చ‌రిక‌ల్ని ఇజ్జ‌త్ కా స‌వాల్ అన్న‌ట్లుగా తీసుకున్న ఆయ‌న‌.. క‌రెండు స‌మ‌స్య అంతు చూడ‌ట‌మే కాదు.. రైతుల‌కు 24 గంట‌ల క‌రెంటు ఇస్తామ‌నే వ‌ర‌కూ వెళ్లారు. రోజుకు ఎనిమిది గంట‌లు చాలు.. 24 గంట‌లూ కరెంటు ఇస్తే ఇబ్బంది సార్ అంటూ రైతులు అనే వ‌రకూ ఇష్యూను తీసుకెళ్లారు.

తీవ్ర‌మైన విద్యుత్ స‌మ‌స్య నుంచి మిగులు విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేసే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్ల‌గ‌లిగిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. కోటి మందికి పైగాప్ర‌జ‌లు ఉండే రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ విష‌యంలో ఎందుకు స్పందించ‌ర‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. కాలం చెల్లిన డ్రైయినేజి వ్య‌వ‌స్థ‌తో పాటు.. ఇరుకు రోడ్లు.. ప‌ద్మ‌వ్యూహం లాంటి ట్రాఫిక్ జాంలు.. చినుకు ప‌డితే చిత్త‌డి అయ్యే హైటెక్ న‌గ‌రిని వ‌ర‌ల్డ్ క్లాస్ సిటీగా మారుస్తాన‌న్న మాట‌ను నిల‌బెట్టుకునే దిశ‌గా అడుగులు ఎందుకు వేయ‌ర‌న్న‌ది అర్థం కాదు.

స‌క‌ల ద‌రిద్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిన హైద‌రాబాద్ అంతు చూసి.. కేసీఆర్ మార్క్ ప్రక్షాళ‌న కార్య‌క్ర‌మాన్ని ఎందుకు షురూ చేయ‌ర‌న్న‌ది అర్థం కానిదిగా మారింద‌ని చెప్పాలి. దాదాపు ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రానికి ముందు భారీగా కురిసిన వ‌ర్షానికి న‌గ‌రం వ‌ణికిపోవ‌ట‌మే కాదు.. ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌య్యారు. అలాంటి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుతామ‌ని చెప్పి నెల‌లు పూర్తి అవుతున్నా.. ఇప్ప‌టికి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా మారిందే త‌ప్పించి ఎలాంటి మార్పు లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

శుక్ర‌వారం (వినాయ‌క‌చ‌వితి రాత్రి) కురిసిన మూడు గంట‌ల వ‌ర్షానికి వ‌ణికిపోయిన భాగ్య‌న‌గ‌రిని చూసిన‌ప్పుడు స‌మ‌ర్థుడైన ముఖ్య‌మంత్రి ఉండి కూడా హైద‌రాబాద్ కు ఈ ద‌రిద్రం ఏమిటి? అన్న ప్ర‌శ్న స‌గ‌టు హైద‌రాబాదీకి క‌ల‌గ‌క మాన‌దు. అప‌ర భ‌గీర‌ధుడిగా గులాబీ నేత‌లు అభివ‌ర్ణించే కేసీఆర్ కు హైద‌రాబాద్ ఈతి క‌ష్టాలు ఎందుకు ప‌ట్ట‌వు?  తెలంగాణ రాష్ట్రానికి మ‌కుటాయ‌మానంగా నిలిచే భాగ్య‌న‌గ‌రిని ప్ర‌క్షాళ‌న చేయ‌లేని ప‌క్షంలో.. మ‌రెన్ని ప్ర‌క్షాళ‌న‌లు చేసినా అవేమీ కేసీఆర్‌కు రావాల్సిన పేరు రానివ్వ‌వ‌న్న అస‌లు స‌త్యాన్ని గుర్తిస్తే మంచిద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ముఖానికి ఎంత మేక‌ప్ వేసినా.. మ‌న‌సు వేద‌న‌లో ఉంటే.. ముఖంలో క‌ళ ఉండ‌ద‌న్న విష‌యాన్ని కేసీఆర్ గుర్తిస్తే మంచిది. లేకుంటే.. ఎన్ని విజ‌య‌వంత‌మైన కార్య‌క్ర‌మాలు చేసినా.. కోటి మందికి పైగా ఉండే హైద‌రాబాద్‌కు ప‌ట్టిన నిర్ల‌క్ష్యాన్ని.. అధికారుల అల‌క్ష్యాన్ని ప్ర‌క్షాళ‌న చేయ‌కుంటే ఆ ప్ర‌యోజ‌నం సిద్ధించ‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.


Tags:    

Similar News