విషెస్ చెప్పండి కేసీఆర్ !

Update: 2022-07-22 03:20 GMT
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ జ‌రిగింద‌ని తెలుస్తోంది.దీంతో కేసీఆర్ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. అంటే ఆయ‌న మ‌ద్ద‌తు ఇచ్చిన య‌శ్వంత్ గెలుస్తార‌ని కాదు కానీ ఆశించిన స్థాయిలో ఓట్లు వ‌స్తాయ‌ని అంతా ఆశించినా కూడా బీజేపీయేత‌ర పార్టీల‌లో కొంద‌రు (విపక్షంలో ఉన్న వారు విప్ లేద‌నందున ) హాయిగా ద్రౌప‌దీ ముర్మూకే ఓటు వేశారు. ఓ విధంగా కేసీఆర్ వినిపించిన సామాజిక న్యాయం అనే  నినాదాన్నీ అంతా బాగానే వినిపించుకున్నారు.

ఇదే స‌మ‌యంలో ఆయ‌న రాజ‌కీయ గురువు చంద్ర‌బాబు కూడా త‌నదైన చాతుర్యంతో , తెలివిత‌నంతో బీజేపీ కూట‌మికే మద్ద‌తు ఇచ్చారు. వాస్త‌వానికి ఈ ఎన్నిక‌ల్లో టీడీపీకి ఉన్న బ‌లం ఎంత‌న్న‌ది అటుంచితే నంబ‌ర్ గేమ్ లో కేసీఆర్ ఓడిపోయారు అన్న‌ది మాత్రం అంగీక‌రించ‌ద‌గ్గ విష‌యం.

క‌నుక‌నే టీఆర్ఎస్ శ్రేణులు కానీ ఆఖ‌రికి కేసీఆర్ కానీ మాట మాత్రంగా కూడా ద్రౌప‌దీ ముర్మూకు శుభాకాంక్ష‌లు చెప్ప‌లేదు. ఇదే ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో చ‌ర్చకు తావిస్తోంది.

ఇదే స‌మ‌యంలో వైసీపీ ప్ర‌ద‌ర్శించిన రాజ‌కీయ ప‌రిణితి కార‌ణంగా, టీడీపీ ప్ర‌ద‌ర్శించిన రాజ‌కీయ చ‌తుర‌త కార‌ణంగా వారికి ప‌బ్లిక్ లో కాస్తో కూస్తో ఇమేజ్ కూడా పెరిగింది. కానీ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో సత్తా చాటుతాం అని మొద‌ట్నుంచి చెబుతూ వ‌స్తున్న కేసీఆర్ మాత్రం ఆశించిన స్థాయిలో ఓట్ల‌ను ముఖ్యంగా త‌న‌వారి బ‌లాన్నీ కూడ‌గ‌ట్ట‌లేక‌పోయారు. ఆఖ‌రికి మ‌మ‌తా మనుషులు కూడా  ప‌శ్చిమ బెంగాల్ లో ద్రౌప‌దీ ముర్మూకే ఓట్లేశార‌ని తేలిపోయింది.
Tags:    

Similar News