ధనిక రాష్ట్రానికి ఈ అప్పులేంది కేసీఆర్?

Update: 2017-03-14 04:20 GMT
అభివృద్ధి పేరిట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ తియ్యటి మాటలేనని తేలిపోయింది. బంగారు తెలంగాణనే తమ లక్ష్యంగా చెబుతూ ఆయన చెప్పే మాటలన్నీ బడాయి కబుర్లేనన్న విమర్శలకు బలం చేకూరేలా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చేతికి ఎముక లేనట్లుగా వరాలు ప్రకటించే కేసీఆర్ తీరుతో ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల రాష్ట్రంగా మారుతుందన్న విషయం స్పష్టమైంది. తాజాగా ప్రవేశ పెట్టిన ఈటెల రాజేందర్ బడ్జెట్ లెక్కల్ని చూసినప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ అప్పుల భారం రాష్ట్రం మీద అంతకంతకూ పెరుగుతుందన్న విషయం స్పష్టమవుతుందని చెప్పాలి.

సంపన్న రాష్ట్రం అంటే.. సంపదతో తులతూగే రాష్ట్రమే తప్పించి.. ఇష్టారాజ్యంగా అప్పులు చేయటం ఎంతమాత్రం కాదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.  మరో రెండు మూడు నెలలు గడిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు నిండుతుంది. అదే సమయంలో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ల అవుతుంది. మరి.. మూడేళ్ల వ్యవధిలో కేసీఆర్ సర్కారు సాధించిందేమిటి? అన్న ప్రశ్న వేస్తే.. కళ్లు బైర్లు కమ్మే అప్పుల లెక్క కనిపిస్తుంది.

తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఊహించనంత అభివృద్ధి చేసినట్లుగా తెలంగాణ సర్కారు అదే పనిగా చెప్పుకోవటం కనిపిస్తుంది.అభివృద్ధి అప్పులతో చేయకూడన్న ప్రాధమికమైన విషయాన్ని కేసీఆర్ సర్కార్ మిస్ అయిన విషయంతాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. టీఆర్ ఎస్ సర్కారు కొలువు తీరిన మూడేళ్ల వ్యవధిలో పెరిగిన అప్పు రూ.77వేల కోట్లకు పెరగటం దేనికి నిదర్శనం? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో అంతులేని అన్యాయం జరిగిందని అవకాశం వచ్చిన ప్రతిసారీ విరుచుకుపడే కేసీఆర్ సర్కార్.. అరవైఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీగా అప్పులు చేయలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అప్పు చేసి పప్పు కూడు అన్న చందంగా అభివృద్ధి పథంలోకి దూసుకెళుతున్నట్లు చెప్పుకునే తెలంగాణ సర్కారు తాను చేస్తున్న భారీఅప్పుల గురించి.. ఏడాదికేడాది పెరుగుతున్న అప్పుల గురించి ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారీగా అప్పులు చేసేసి..అభివృద్ధి చేసేశామంటే కుదరదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ధనిక రాష్ట్రం అంటే ఆదాయ మిగులును చూపిస్తేనే సరిపోదు. చేసిన అప్పు నుంచి మిగులుగా చెబుతున్న మొత్తాన్ని తీసేసిన తర్వాత కూడా మిగిలి ఉంటే ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోవచ్చు. అంతేకానీ.. అంకెల మాయాజాలంతో మిగులును చూపించేసి ధనిక రాష్ట్రమని చెప్పటమంటే.. అదంతా ఉత్త బడాయి మాటలే అవుతాయే తప్పించి.. మరింకేమీ కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News